ప్రభుత్వ సొమ్మంతా బాబు, లోకేశ్‌ల పర్సంటేజీలకే.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సొమ్మంతా బాబు, లోకేశ్‌ల పర్సంటేజీలకే..

Sep 21 2026 12:02 AM | Updated on Sep 21 2026 12:02 AM

పెన్షన్లు స్థానిక ఎన్నికల స్టంట్‌ మాత్రమే

మాజీ మంత్రి నల్లపరెడ్డి

ప్రసన్నకుమార్‌రెడ్డి

కొడవలూరు: ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు, లోకేశ్‌లు కాంట్రాక్టర్‌లకు చెల్లిస్తూ వారి నుంచి పర్సంటేజీలు దండుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని నార్తురాజుపాళెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ మండల విస్తృత స్ధాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మంతా తండ్రీకొడుకుల పర్పంటేజీలకే సరిపోతుందన్నారు. సంక్షేమానికి ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. సామాజిక పింఛన్‌లు ఇస్తామని కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తోందని, ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం కోసం పింఛన్‌లను ఎరగా వేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేసుకోవడం మినహా కూటమి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. పచ్చ మీడియా అంతా ఒక్కటై దుష్ప్రచారం చేయడం ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించాలని చూస్తున్నాయని చెప్పారు. వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజల మనసుల్లో జగన్‌ ఉన్నారన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ పవన్‌ కల్యాణ్‌ అబద్ధపు ప్రచారం చేశారన్నారు. మహిళలెవరూ అదృశ్యం కాలేదని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని తెలిపారు. ప్రతిసారి అబద్ధాలను ప్రజలు నమ్మరని గుర్తించుకోవాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల కారణంగా అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కూటమి పాలనలో సంక్షేమం అందక పేద, మధ్య తరగతి వారు ఎన్నో బాధలు పడతున్నారన్నారు. కోవూరు నియోజకవర్గంలో 18 మంది నాయకులు డబ్బు ప్రలోభానికి లొంగి వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారని, వీరంతా తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోవడం జరగదన్నారు. ప్రస్తుతమున్న నాయకులతోనే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయబావుటా ఎగుర వేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్‌ గొల్లపల్లి విజయకుమార్‌, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షులు చిమటా శేషగిరి, మావులూరి శ్రీనివాసులురెడ్డి, సీహెచ్‌ సతీష్‌రెడ్డి, కె.నవీన్‌రెడ్డి, ఎంపీపీ గాలి జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement