● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడు పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఆదివారం బొలెరో, మినీ వ్యాన్ ఎదురుగా ఢీకొన్నాయి. ఒకరు అక్కడికక్కడే, మరొకరు మార్కాపురం జిల్లా పామూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఒంగోలు నుంచి మదనపల్లికి బొలెరో వాహనం వెళ్తోంది. చైన్నె క్రోసూరు నుంచి మార్కాపురం జిల్లా పెదచెర్లపల్లి మండలానికి మినీ వ్యాన్ బయలుదేరింది. ఇందులోని వారు పెళ్లిచూపుల కార్యక్రమ నిమిత్తం వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న లక్ష్మీనారాయణ (50), ప్రకాశం (40) మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వరికుంటపాడు ఎస్సై కె.మధుసూదన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు.
బైక్ ఢీకొని..
కలిగిరి: మండలంలోని కావలి ముస్తాపురం పంచాయతీ దంటుపాళెం వద్ద ప్రధాన రహదారిపై టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తున్న పాజర్ల మాలకొండయ్య అలియాస్ మారేష్ (55) అనే వ్యక్తిని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. దంటుపాళేనికి చెందిన మాలకొండయ్య కలప కొనుగోలు చేసి కొట్టి అమ్మకునే వ్యాపారం చేస్తుంటాడు. ఆదివారం గుంపర్లపాడు సెంటర్‌కు వెళ్లి చికెన్ తీసుకుని తిరిగి టీవీఎస్ మోపెడ్‌పై ఇంటికి బయలుదేరాడు. ప్రధాన రహదారి నుంచి ఊరిలోకి వెళ్తుండగా గుంపర్లపాడు నుంచి కలిగిరికి వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో మాలకొండయ్యకు తీవ్రగాయాలయ్యాయి. బంధువులు 108 అంబులెన్స్‌లో వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. కలిగిరి పోలీసులు వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.
రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వేర్వేరు మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.


