● రూ.30 వేల విలువైన డ్రగ్స్ స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): ఎండీఎంఏ అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.30 వేల విలువైన డ్రగ్స్‌ను, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నగర ఏఎస్పీ దీక్ష నిందితుల వివరాలను వెల్లడించారు. ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున వెంకటాచలం ఇన్‌స్పెక్టర్ ఎ.సురేంద్రబాబు తన సిబ్బందితో వెంకటాచలం జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో గుంటూరుకు చెందిన బి.నితిన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి రూ.30 వేల విలువైన 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా గుంటూరులోని ఇమ్రాన్ ప్రమేయం ఉన్నట్లు తెలింది. బెంగళూరులో ఓ వ్యక్తి వద్ద ఎండీఎంఏ కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకెళుతున్నట్లు పోలీసులకు వెల్లడించారు. దీంతో తొలుత నితిన్‌ను, అనంతరం ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరాదారుడిపై కేసు నమోదు చేశారు.
నిందితులిద్దరూ స్నేహితులు
గుంటూరు నగరానికి చెందిన నితిన్, ఇమ్రాన్‌లు స్నేహితులు. నితిన్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి డ్రగ్స్ తీసుకునే అలవాటుగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంను కొనుగోలుచేసి గుంటూరుకు తరలిస్తున్న క్రమంలో నితిన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సురేంద్రబాబుతోపాటు బాలాజీ నగర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌లు కె.సాంబశివరావు, దశరథ రామారావు, వెంకటరావు, సిబ్బందిని పోలీసు ఉన్నతాఽధికారులు అభినందించారు.


