● సాంఘిక సంక్షేమ మంత్రికి
తిరుపతి ఎంపీ లేఖ
చిల్లకూరు: ‘ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు పేరుతో కోటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా ఎత్తివేయడం దారుణం. సుమారు 600 మంది విద్యార్థుల భవిష్యత్ కోసం ఆ పాఠశాలను వెంటనే పునరుద్ధరించాలి’ అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయలుకు సోమవారం లేఖ రాశారు. సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాలను ఎత్తి వేసి విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గురుకులాన్ని పునరుద్ధరిస్తూ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను కూడా కొనసాగించాలని ఆయన లేఖలో కోరారు.
హత్య కేసులో
ముగ్గురికి జీవిత ఖైదు
గూడూరు: నాయుడుపేట మండలంలోని విన్నమాల గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ గూడూరులోని ఏడో అదనపు జిల్లా జడ్జి సోమవారం తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంతకుమార్ కథనం మేరకు.. విన్నమాలలోని అరవ శ్రీనివాసులుపై 2022వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన నాయుడుపేట టౌన్‌కు చెందిన పేర్నాటి బెన్హర్, పేర్నాటి అనిల్, పేర్నాటి సాగర్ దాడి చేశారు. దీంతో అతను చనిపోయాడు. మృతుడి కుమారుడు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖాలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి జీవిత ఖైదు విధించడంతోపాటుగా ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానాను విధించారు. కేసు విచారించి దోషులకు శిక్ష పడేలా చేసిన పీపీ, నాయుడుపేట అర్బన్ సీపీ వెంకటేశ్వరరావు, సీఐ వైవీ సోమయ్య, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్, కోర్టు హెడ్‌కానిస్టేబుల్ పి.నరసింహులు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబును తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.
జిల్లాలో పెరిగిన
విద్యుత్ వినియోగం
● ఎస్‌ఈ సుధాకర్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు నెలలో గత ఏడాదితో పోలిస్తే 36 శాతం అధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ సుధాకర్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు డివిజన్ల నుంచి 16 మంది వినియోగదారులు తమ సమస్యలను తెలిపారు. వీటిలో లో ఓల్టేజీ, సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్‌కు మార్పు, సోలార్ విద్యుత్‌కు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఈ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. గతేడాది ఆగస్టులో 319.109 మిలియన్ యూనిట్ల వినియోగం కాగా, ఈ ఏడాది ఆగస్టులో 433.661 ఎంయూ వినియోగమైందన్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసర సమయాల్లో వినియోగాన్ని తగ్గించుకుని పొదుపు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ (టెక్నికల్) అల్తాఫ్, ఈఈ శ్రీధర్, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
కండలేరులో
18.37 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 18.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


