● నలుగురికి గాయాలు
● జీజీహెచ్‌కు వెళ్తే రోగికి అడ్మిషన్
నిరాకరణ
నెల్లూరు(క్రైమ్): మితిమీరిన వేగంతో వచ్చిన కంటైనర్ ముందు వెళ్తున్న ఇటుకల ట్రాక్టర్‌ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తితోపాటు ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలానికి చెందిన వెంకటరమణమ్మ, విడవలూరు మండలానికి చెందిన రాజేష్, ఈదగాలికి చెందిన శ్యామ్, సౌత్‌రాజుపాళేనికి చెందిన గురవయ్య చింతారెడ్డిపాళెంలోని ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. సోమవారం వారు ట్రాక్టర్‌లో ఇటుకల లోడ్‌తో జాతీయ రహదారి మీదుగా గొలగమూడికి బయలుదేరారు. కావలి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన కంటైనర్ ట్రాక్టర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గురవయ్యతోపాటు వెంకటరమణమ్మ, రాజేష్, శ్యామ్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై వెంకటరమణమ్మ సౌత్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి సాంకేతిక ఆధారాల ద్వారా ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుట్లు వేశాం.. అడ్మిషన్ చేయం
నెల్లూరు(అర్బన్): పెద్దాస్పత్రికి వెళ్తే అరకొర వైద్యం మాత్రమే అందుతోంది. అందుకు ఉదాహరణగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి విషయంలో ఓ డాక్టర్ మాట్లాడిన మాటలు. రోడ్డు ప్రమాద బాధితులను జీజీహెచ్‌కు తరలించగా వారిలో ఇద్దరిని అడ్మిట్ చేసుకున్నారు. రాజేష్ తలకు గాయమైతే కుట్లు వేసి ఇంటికి వెళ్లి ఐదురోజుల తర్వాత రమ్మన్నారు. అతడి పాదాలకు కూడా గాయాలైతే శుభ్రం కూడా చేయలేదు. కనీసం ఆయింట్‌మెంట్ కూడా పూయలేదు. మట్టితో కూడిన గాయాలు అలాగే ఉన్నాయి. రోగి బంధువులు అడ్మిషన్ చేసుకోమని అక్కడి డాక్టర్‌ను అడిగారు. పది కుట్లు వేసిన వారిని కూడా ఇంటికి పంపిస్తున్నాం. అందరికీ అడ్మిషన్ ఇస్తే ఆస్పత్రి నిండిపోతుంది. ఈ రోగికి అడ్మిషన్ అవసరం లేదని సమాధానమిచ్చారు. అతను నడవలేడు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్తాం. అప్పటి వరకై నా బెడ్ ఇవ్వాలని బంధువులు కోరితే ఇక్కడ ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో ఆ పేషెంట్ నడవలేక నేలపై పడుకుని లేవలేకపోయాడు. ఆ పరిస్థితి చూసిన వారు అయ్యో పాపం అన్నారు. కానీ డాక్టర్లకు మాత్రం ఉన్న కాసేపైనా బెడ్ ఇద్దామనే ఆలోచన లేదు. తర్వాత కొంతసేపటికి కుటుంబీకులు అతడిని నారాయణ ఆస్పత్రికి తరలించారు.


