● భర్తను కోల్పోయిన భార్య
● కారుణ్య నియామకం కోసం
ఏడాదిన్నరగా ఎదురుచూపులు
● మరోవ్యక్తికి అదే పరిస్థితి
● రెండు రోజులు ఆగితే ఉద్యోగం కష్టమే
నెల్లూరు(అర్బన్): కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త ఆర్‌అండ్‌బీ శాఖలో వాచ్‌మెన్‌గా చిరుద్యోగం చేస్తూ మృతిచెందడంతో ఆమెకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. నిబంధనల మేరకు కనీసం కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని గిరిజన మహిళ భావించింది. అయితే ఏడాదిన్నరగా ఆ ఆశ నెరవేరలేదు. దరఖాస్తులతో ఆర్‌అండ్‌బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు పట్టించుకోకుండా మరో అధికారి వద్దకు వెళ్లాలని తిప్పుకుంటున్నారు. గూడూరులోని మరో వ్యక్తి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కాగా కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఈనెలాఖరుతో కారుణ్య నియామకాలకు బ్రేక్ పడనుంది. దీంతో వారు శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ సర్కిల్ కార్యాలయంలో నేల మీద కూర్చొని నిరాహార దీక్ష చేపట్టారు.
వాచ్‌మెన్‌గా పనిచేస్తూ మృతి
కోవూరుకు చెందిన గిరిజనుడు తుపాకుల శేషయ్య నెల్లూరు ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఒకటిన్నర సంవత్సరం క్రితం మృతి చెందాడు. దీంతో భార్య ఒంటరిదైంది. బతికేందుకు భర్త ఉద్యోగం తనకు ఇప్పించాలని ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆమె గిరిజనురాలు కావడంతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేకుండాపోయింది. దీనిని సాకుగా పెట్టుకుని ఉద్యోగం ఇవ్వలేమని.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో ఆమె కలెక్టర్‌కు అర్జీ ఇచ్చింది. ఆయన సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, డెంటల్, ఫోరెన్సిక్, రేడియోలజీ విభాగాలకు చెందిన డాక్టర్ల కమిటీని ఏర్పాటు చేసి పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. వారు పరిశీలించి ఆమె వయస్సును 36 ఏళ్లుగా నిర్ధారించారు. సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అది కూడా చెల్లదని ఆర్‌అండ్‌బీ అధికారులు కొర్రీ వేసి ఆర్డీఓ ద్వారా తెచ్చుకోవాలని కోరారు. కాగా ఆర్డీఓ పెద్దాస్పత్రి డాక్టర్ల సర్టిఫికెట్ పరిశీలించి విచారణ జరిపి సచివాలయం ద్వారా 1990 సంవత్సరం అక్టోబర్ నెలలో పుట్టినట్టు సర్టిఫికెట్‌ను ఇచ్చారు.
ఫైనాన్స్ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్
కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన నేపథ్యంలో పోస్టింగ్‌లు, ప్రమోషన్లు లాంటి వాటిని నిలిపేశారు. అయితే అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ప్రభుత్వాదేశాల మేరకు ఫైనాన్స్ శాఖ ఈనెల 22న ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యోగాలిచ్చి తర్వాత ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ రెండు రోజులు ఆగితే ఇక బాధితులకు ఇప్పట్లో ఉద్యోగాలు రావు.
జియావుల్ హక్‌కు తప్పని ఇబ్బందులు
గూడూరు ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ షేక్ మెహతాబ్ అనే మహిళ జూన్ నెలలో మృతి చెందింది. ఆమె కుమారుడు జియావుల్ హక్ కూడా కారుణ్యనియామకం కింద తనకు వాచ్‌మెన్ పోస్టు కల్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
లంచాలు ఇవ్వనందునే..
నానా కష్టాలు పడి అధికారులు అడిగిన సర్టిఫికెట్లను తెచ్చి కారుణ్య నియామకాల కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆశాఖ సూపరింటెండెంట్, క్లర్క్ తదితర వారికి లంచాలు ముట్టలేదనే ప్రచారం జరుగుతోంది. పూట గడవని వారు లంచాలు ఇవ్వకపోవడంతో అసలు ఇప్పట్లో ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


