రూ.లక్షలు లూటీ చేసి.. కనీసం గుర్రపు డెక్క కూడా తొలగించని సౌత్ ఫీడర్ కాలువ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాకు జీవనాడి సోమశిల ప్రాజెక్ట్ అవినీతి పరుల పాలిట కల్పతరువుగా మారింది. ప్రాజెక్ట్ కాలువల నిర్వహణ పనుల పేరుతో సాగిన ఈ బాగోతం ఇరిగేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏసీబీ ట్రాప్‌తో అవినీతి డొంక కదలగా, ఆర్టీఐ సమాచారంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పనుల వివరాలు అధికార యంత్రాంగానికే చెమటలు పట్టిస్తున్నాయి. తాగు, సాగునీటి కాలువల నిర్వహణను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తోంది. తుఫాన్లు, వరదలు వచ్చి కాలువలు, చానల్స్ దెబ్బతిన్నప్పుడు చేపట్టే మెయింటెనెన్స్ పనుల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి పనులు చేయకుండానే సౌత్ ఫీడర్ చానల్ పనులు పూర్తి చేసినట్లు కాగితాల్లో చూపి ఏకంగా రూ.10 కోట్ల దోపిడీకి బినామీ కాంట్రాక్టర్‌తో కలిసి అధికారులు స్కెచ్ వేశారు. తట్టడు మట్టి తీయకుండానే బిల్లులు పెట్టేశారు... అధికారులు సైతం బిల్లులపై సంతకాలు చేసి అప్రూవల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి ముగ్గురు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను అదుపులోకి తీసుకోవడంతో ఆ శాఖ అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయి. ఆర్టీఐ సమాచారంతో ఇరిగేషన్ శాఖలో అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సైతం ఈ దోపిడీ బాగోతాలపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
టెండర్స్ లేవు.. నామినేషన్లపైనే..
కలెక్టర్ మంజూరు చేసిన పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క చోట పనిపూర్తి చేయలేదు. ఒకటీ అర చోట కాస్త మట్టిని చదును చేశారంతే. ఈ 100 పనులకు సంబంధించి టెండర్స్ పిలవలేదు. నామినేషన్లపై నచ్చిన వారికే కట్టబెట్టారు. కాగితాల్లోనే పనులు పూర్తి చేశారు.. ఖాతాల్లో నిధులు మళ్లించుకున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన పనుల ఆనవాళ్లు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. కానీ ఫైళ్లలో మాత్రం పూర్తయినట్లు నమోదు చేశారు. చివరకు చేపట్టిన పనులకు కొలతల్లేవు.. తనిఖీల్లేవు.. కానీ బిల్లులకు మాత్రం అధికారులు ఆమోద ముద్రలు వేశారు.
ఎఫ్‌ఏసీ ఎస్‌ఈపై ఆరోపణలు
ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ముగ్గురు ఇంజీనీర్లు మాత్రమే దొరికారు. ఎఫ్‌ఏసీ ఎస్‌ఈగా ఉన్న అధి కారి ఒకే పేరు మీద ఉన్న అన్ని బిల్లులకు ఎలా సంతకం చేశారో తెలియడం లేదు. క్షేత్ర స్థాయి పరిశీలన లేదు. మెజర్‌మెంట్ తీయలేదు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా పరిశీలించకుండా సర్టి ఫికెట్ ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో బినామీ కాంట్రాక్టర్‌కు 50 శాతం, ఇరిగేషన్ శాఖలోని ఇంజినీర్లకు 50 శాతం వాటాల ఒప్పందంతోనే పనులు చేయకుండానే బిల్లులు సంతకాలయ్యాయి. గతంలో ఇదే అధికారి ఉన్నప్పుడు సోమశిల ప్రాజెక్ట్ నుంచి పాలకులకు, జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండా ఏకంగా ఒక టీఎంసీ నీటిని కిందికి వదిలేశారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. ఎవరి కోసం నీటిని వదిలారంటూ రచ్చ జరిగింది. ఇప్పుడు కూడా ఇదే అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. విజిలెన్స్ విచారణ చేపడితే.. నిజాలు నిగ్గుతేలుతాయి. ఏసీబీ తనిఖీల్లో తప్పించుకున్న వారు సైతం పట్టుబడతారు.
కాలువల్లో కమీషన్ వరద
సోమశిల ప్రాజెక్ట్ కాలువల నిర్వహణ పనుల్లో అవినీతి వరద పోటెత్తింది. కంచే చేను మేసిన చందంగా ప్రాజెక్ట్ అధికారులే కాగితాల్లోనే డిజైన్లు చూపించి రూ.కోట్ల కమీషన్లుగా కొల్లగొట్టేశారు. క్షేత్ర స్థాయిలో పనుల ఆనవాళ్లు కనిపించకపోయినా.. ఫైళ్లలో మాత్రం పూర్తయ్యాయి. కొలతల్లేవు.. తనిఖీల్లేవు.. కానీ బిల్లులకు ఆమోద ముద్రలు లభించాయి. టెండర్లు లేకుండానే నామినేషన్ల పేరుతో ప్రాజెక్ట్ చైర్మన్ బినామీ కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టారన్న ఆరోపణలు, రూ.కోట్ల బిల్లులు సృష్టించి కాజేశారన్న ఫిర్యాదులు ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో ప్రకంపనలు రేపుతున్నాయి. కాలువల్లో మట్టి తొలగించకుండానే తొలగించినట్లు, గండ్లు పూడ్చకుండానే పూడ్చినట్లు, అత్యవసర మరమ్మతులు చేయకుండానే చేసినట్లు బిల్లులు పెట్టడం మరింత కలకలం సృష్టిస్తున్నాయి. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. వంద పనుల వరకు ఇదే తంతుగా సాగినట్లు ఆర్టీఐ సమాచారంతో అవినీతి బట్టబయలు కావడం, ఏసీబీ తనిఖీల నేపథ్యంలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.
ఓఅండ్‌ఎం, ఎఫ్‌డీఆర్ పనుల్లో
రూ.10 కోట్ల లూటీకి స్కెచ్
కాగితాల్లో పనులు.. ఖాతాల్లో సొమ్ములు
బినామీ కాంట్రాక్టర్‌తో
చక్రం తిప్పుతున్న ప్రాజెక్ట్ చైర్మన్
బిల్లుల అప్రూవల్‌లో ఎఫ్‌ఏసీ ఎస్‌ఈ కీలకపాత్ర
ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన
ఓ మాజీ ప్రజాప్రతినిధి
ఇరిగేషన్ శాఖలో ఏసీబీ దాడుల నేపథ్యంలో తవ్వేకొద్దీ అవినీతి ఊట
ఆర్‌టీఐతో వెలుగులోకి వచ్చిన నిర్వహణ పనుల వ్యవహారం
బినామీతో ప్రాజెక్ట్ చైర్మన్ లూటీ
పనులు చేయకుండా బిల్లులు చేసిన వాటిని కొన్నింటిని పరిశీలిస్తే..
1. ఎస్పీ–ఎస్‌ఎఫ్‌సీ–ఓ అండ్ ఎం పనుల్లో 17.500 కి.మీ. నుంచి 23.000 కి.మీ. వరకు సెప్టెంబర్ 2025 నుంచి 26 జూలై 2026 నాటికి మట్టి, రాళ్లు, చెత్తాచెదారం తొలగించిన పనులు పూర్తి చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ నంబర్ 368570 కాగా, చైర్మన్, సో మశిల ప్రాజెక్ట్ కమిటీ పేరుతో చేసినట్టు ఉంది.
2. 23.000 కి.మీ. నుంచి 28.000 కి.మీ. వరకు 371716 అగ్రిమెంట్ నంబర్‌తో బిల్లు ఓకే చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి చెత్తను తొలగించడం గాని, రాళ్లను తొలగించడం గాని జరగలేదు.
3. 35.000 కి.మీ. నుంచి 38.500 కి.మీ. వరకు, 38.500 కి.మీ. నుంచి 42.000 కి.మీ. వరకు పనులు చేయలేదు. బిల్లు అప్రూవల్ చేశారు. ఇలా సుమారు 10 పేర్లకు పైగా ప్రాజెక్ట్ చైర్మన్ పేరుతోనే పనులు పూర్తయినట్టు వివరాలున్నాయి.
4. వాచ్ అండ్ వర్డ్ అరేంజ్‌మెంట్స్‌కు సంబంధించిన ఎస్‌ఎఫ్‌సీ పనులు 58.500 కి.మీ. నుంచి 70.000 కి.మీ. వరకు హర్షవర్ధన్ పేరుతో పూర్తి చేసినట్లు ఉంది.
5. అత్యవసర మరమ్మతుల పేరుతో కలువాయి సౌత్ ఫీడర్ 36.325 కి.మీ. నుంచి 38.125 కి.మీ. వరకు, 38.200 కి.మీ. నుంచి 40.100 కి.మీ. వరకు, 40.200 కి.మీ. నుంచి 42,100 కి.మీ. వరకు కలువాయి మండలంలో పనులు జరిగాయి. ఈ పనులను లీలామాధవ్ పూర్తి చేసినట్టు చూపారు. ఇలా 100 వరకు పనులు చేయకుండానే చేసినట్లు కాగితాల మీద బిల్లులు సృష్టించారు. అందిన కాడికి దోచుకున్నారు.
ఈ పనులకు సంబంధించి అవినీతిలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వి. కేశవచౌదరి చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏసీబీకి ఇంజినీర్లతోపాటు కేశవచౌదరి బినామీ కాంట్రాక్టర్ పట్టుబడ్డాడు. సదరు బినామీ కాంట్రాక్టర్ చైర్మన్ సమీప బంధువే కావడం ఆరోపణలకు బలం చేకూరుతోంది. బినామీ కాంట్రాక్టర్ పేరుతోనే అనేక పనులు పూర్తి చేసినట్టు కాగితాల్లో ఉన్నాయి. ఒకే వ్యక్తికి చెందిన అగ్రిమెంట్, బిల్, అగ్రిమెంట్ నంబర్ అనేక పనుల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడే అవినీతికి స్కెచ్ పడింది. అధికారం అండతో చెలరేగిపోయాడనే ఆరోపణలు ముంచెత్తుతున్నాయి. ఇరిగేషన్ ఇంజినీర్లకు లంచాలు ఎరవేసి పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు.
డ్యామ్‌లు, కాలువలు, గేట్లను క్రమబద్ధీకరిస్తూ పంట పొలాలకు సజావుగా నీటిని విడుదల చేసేందుకు, కాలువల పూడిక తీసేందుకు, గండ్లు పడకుండా చూసేందుకు, గేట్లను మరమ్మతులు చేయడం కోసం ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులకు ప్రతి ఏటా నిధులు విడుదలవుతాయి. భారీ వర్షాలు, వరదలతో కాలువలకు పడిన గండ్లు, డ్యామ్ గేట్ల అత్యవసర మరమ్మతులు, దెబ్బతిన్న సబ్ డివిజన్ ఆఫీస్ భవనాల పునరుద్ధరణకు ఎఫ్‌డీఆర్ (ఫ్లడ్ డ్యామేజీ రిపేర్స్) నిధులు మంజూరు చేస్తారు. 2024 నుంచి 2026 వరకు మోంథా, దిత్వా తుఫాన్ వల్ల దెబ్బతిన్న చానల్ పనులకు, ఇతర పనులకు కలెక్టర్ 100 పనులకు రూ.10 కోట్లు మంజూరు చేశారు.


