నెల్లూరు రూరల్: శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నా, జిల్లాలోని సోమశిల, కండలేరుకు జలాలను విడుదల చేయకుండా రైతులను కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లా రైతులు, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భారీ వ్యత్యాసం
ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గణాంకాలను పరిశీలిస్తే శనివారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీశైలం జలాశయంలో నిల్వ 153.5 టీఎంసీలుగా ఉందని, అంటే దాదాపు 71 శాతమని చెప్పారు. అదే సమయంలో 78 టీఎంసీల సామర్థ్యమున్న సోమశిలలో 20.64.. 68 టీఎంసీల సామర్థ్యం గల కండలేరులో 20.15 టీఎంసీలే ఉన్నాయని వివరించారు. సోమశిల నుంచి 2863.. కండలేరు నుంచి 2580 క్యూసెక్కులను వివిధ అవసరాల నిమిత్తం విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎందుకు విడుదల చేయడంలేదు..?
శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే, గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశమున్నా, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. నెల్లూరులోని ప్రాజెక్టులకు ఎందుకు విడుదల చేయడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి పారుదలపై కాకుండా నిధుల పారుదలపైనే ప్రభుత్వానికి ఆసక్తి ఉందని విమర్శించారు. జిల్లా ఇరిగేషన్ వ్యవస్థ దొంగ బిల్లులమయంగా మారిందని ఆరోపించారు. సర్వేపల్లి రిజర్వాయర్‌కు రూ.50 కోట్ల మంజూరు పేరుతో అవసరం లేని పనులు చూపించి బిల్లులను డ్రా చేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారా..?
శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాల కోసం నీటిని వినియోగించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అక్కడి సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాల కోసం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి.. తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం దారుణమని, ఇలాంటి చర్యలను చరిత్ర క్షమించదని స్పష్టం చేశారు.
నెల్లూరుకు ఇదేనా ప్రతిఫలం..?
గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో పది స్థానాలను టీడీపీకి ప్రజలు కట్టబెట్టారని, అయినా ఇక్కడి ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయలేని పరిస్థితుల్లో జిల్లా ప్రజాప్రతినిధులు ఉండటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు భయపడి కూటమి నేతలు నోరు మెదపడంలేదని, వీటిని జిల్లా రైతులు, ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యా తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, విత్తనాల పంపిణీ, పశుగ్రాసం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదని విమర్శించారు. జిల్లాలో నీటి పరిస్థితిపై సమీక్ష సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరిపి రైతుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మొదటి పంటకు సాగునీరందించేలా చూడాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పుడే సోమశిల, కండలేరును క్రమంగా నింపుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా ప్రజలు, రైతాంగం తరఫున తమ పార్టీ ఉద్యమించనుందని స్పష్టం చేశారు.
సోమశిల, కండలేరును ఖాళీ చేసి రైతులకు ద్రోహం చేస్తారా..?
నీటి నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి


