ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్‌ దాడులు

Aug 23 2026 12:10 AM | Updated on Aug 23 2026 12:10 AM

చిల్లకూరు: గూడూరు రెండో పట్టణ పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలను విజిలెన్స్‌ అధికారులు శనివారం నిర్వహించారు. ఎరువుల విక్రయాల్లో లోపాయికారీతనంగా వ్యవహరిస్తూ బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిమ్మ మార్కెట్‌ సమీపంలో ఉన్న ఎస్సెస్‌ ఆగ్రోమార్ట్‌లో రూ.10.12 లక్షల విలువైన ఎరువులు అనధికారికంగా ఉన్నాయనే అంశాన్ని గుర్తించారు. రాజేష్‌ ఆగ్రో సెంటర్‌లో రూ.2.1 లక్షల ఎరువులు అధికంగా ఉండటాన్ని కనుగొన్నారు. దీంతో ఈ దుకాణాల్లో ఎరువులను సీజ్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. విజిలెన్స్‌ సీఐలు సుభాన్‌, నరసింహరావు, ఏఓ వేణుగోపాల్‌, తహసీల్దార్‌ కృష్ణప్రసాద్‌, మైనింగ్‌ ఏజీ సుబ్బయ్య, గూడూరు ఏడీ గోపీనాయక్‌, ఏఓ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నంబర్‌ బ్లాక్‌ చేసిందనే కక్షతో హత్య

నిందితుడి అరెస్ట్‌

కావలి: పట్టణంలోని వెంగళరావునగర్‌లో ఈ నెల 18న జరిగిన మహిళ దారుణ హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్‌ చేశామని కావలి డీఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన తెలియజేశారు. సహజీవనం సాగిస్తున్న సునీత తన నంబర్‌ను కొద్ది రోజులుగా బ్లాక్‌ చేసిందనే కారణంతో హత్యకు నిందితుడు మహేంద్ర తెగబడ్డారని తెలిపారు. జలదంకికి చెందిన ఉప్పు శ్రీనివాసులు, సునీతకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. విభేదాల నేపథ్యంలో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొండాపురం మండలానికి చెందిన మహేంద్రతో సునీతకు పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. బేల్దారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వీరు వెళ్లారు. ఆ తర్వాత కావలికి వచ్చేసి వెంగళరావునగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ తరుణంలో దంపతులను తిరిగి ఒక్కటి చేసేందుకు బంధువులు యత్నించారు. దీంతో మహేంద్ర నంబర్‌ను కొద్ది రోజులు ఆమె బ్లాక్‌ చేశారు. సునీతపై అనుమానం పెరిగి.. వెంగళరావునగర్‌లోని ఇంటికొచ్చి ఈ విషయమై నిలదీశారు. వీరి మధ్య మాటామాటా పెరగ్గా, ఆవేశంతో స్క్రూ డ్రైవర్‌తో ఆమెను పొడిచి చంపారని డీఎస్పీ చెప్పారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ పడమట శివార్లలోని పీజీ సెంటర్‌ జామాయిల్‌ తోటలో నిందితుడ్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చామని చెప్పారు.

దగ్ధమైన కారు

ఆత్మకూరు: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు దగ్ధమైన ఘటన పట్టణంలోని తోటవీధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. సమీపంలో నివసిస్తున్న వెంగళరావుకు ఎ ర్టిగా సీఎన్జీ కారుంది. ఒక్కసారిగా కారు అగ్నికీలల్లో చిక్కుకోవడంతో శబ్దాలకు స్థానికులు లేచి విషయాన్ని యజమానికి తెలియజేశారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వాహన దగ్ధానికి గల కారణాలు తెలియరాలేదు.

కారు ఢీకొని సైక్లిస్ట్‌ దుర్మరణం

సంగం: కారు ఢీకొనడంతో సైక్లిస్ట్‌ మృతి చెందిన ఘటన మండలంలోని వెంగారెడ్డిపాళెం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. పొలం పనుల నిమిత్తం సిద్ధీపురం నుంచి వెంగారెడ్డిపాళెం వైపు దండు చిన్నయ్య (48) సైకిల్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్‌ ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా వాహన వివరాల కోసం పోలీసులు యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement