అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో దొరసానమ్మ గంధ మహోత్సవాన్ని వేడుకగా శుక్రవారం రాత్రి నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో మాజీ ముతవల్లీ హఫీజ్‌పాషా గంధ కలశాన్ని ఎత్తుకురాగా, గంధ మహోత్సవాన్ని రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఫయాజ్ అహ్మద్ వర్గం సైతం కలశంతో ఉరేగింపుగా బయల్దేరారు. దీంతో పోటాపోటీగా సాగింది. సుగంధ ద్రవ్యాల, అత్తరు, పన్నీరుతో కలిసి తయారు చేసిన గంధాన్ని నింపారు. దీన్ని తలపై ఉంచుకొని మహల్ నుంచి ఊరేగింపుగా బయల్దేరారు. మేళతాళాలు, భక్తి కీర్తనలు, ఫకీర్ల జరాబులు, బాణసంచా మోతల నడుమ హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాకు భక్తులు చేరుకున్నారు. అనంతరం అమ్మాజాన్, అబ్బాజాన్ సమాధులకు గంధాన్ని లేపనం చేసి ప్రత్యేక ఫాతేహాలు, సలాముల అనంతరం భక్తులకు అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.


