● ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ నందకిశోర్
నెల్లూరు(అర్బన్): అర్హతుండి ప్రాక్టీస్ చేయబోయే డాక్టర్లు రిజిస్ట్రేషన్‌ను విధిగా చేయించుకోవాలని, అలా కాకుండా వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ నందకిశోర్ పేర్కొన్నారు. నగరంలోని సరస్వతీనగర్‌లో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్, రీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్టర్లు సమయం కాగానే రె న్యువల్ చేయించుకోవాలని సూచించారు. పాతతరం డాక్టర్లు కొందరు చాలా కాలం క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకొని, రెన్యువల్ చేయించుకోలేదనే విషయం తమ దృష్టికొచ్చిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం విజయవాడకు గతంలో వెళ్లాల్సి వచ్చేదని, అయితే గతేడాది నుంచి జిల్లా కేంద్రాలకు తామే వచ్చి చేస్తున్నామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి దేశంలో ఆన్‌లైన్‌ను పక్కాగా చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుందని వివరించారు. ఆన్‌లైన్లో ఇంటి వద్ద నుంచే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నామని ప్రకటించారు. హోమియో, ఆయుర్వేదం చదివిన నాన్ అల్లోపతి వైద్యులు.. ఈ వైద్యం చేయడం చట్టవిరుద్ధమన్నారు. అత్యధిక మోతాదులో హయ్యర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను విచ్చలవిడిగా రోగులకు నకిలీ డాక్టర్లు అంటగడుతున్నారని చెప్పారు. సింపుల్ యాంటీబయాటిక్స్‌నే వినియోగించాలని సూచించారు. ఈ అంశాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ తరఫున డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న డాక్టర్ల వద్దకే రోగులెళ్లి వైద్యం చేయించుకోవాలని కోరారు. సీఎంఈ ప్రోగ్రామ్‌లకు హాజరయ్యే వారికి మెడికల్ కౌన్సిల్ తరఫున ఆరు క్రెడిట్ స్కోర్ పాయింట్లను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సహకరించిన ఐఎంఏ నేతలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు మౌర్యగుప్తా, ఐఎంఏ రాష్ట్ర నేత అశోక్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ మస్తాన్‌బాషా, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


