నెల్లూరు(అర్బన్): నగరంలోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి.తేజస్ సాయి సమర్పించిన పరిశోధన ప్రాజెక్ట్‌కు కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ ఆమోదం తెలిపింది. దీంతో మెడికల్ కళాశాలలో మంగళవారం ఆ వైద్య విద్యార్థిని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 17,500 పరిశోధనలలో 1650 ప్రాజెక్ట్‌లు ఎంపిక కాగా అందులో నెల్లూరుకు చెందిన విద్యార్థి తేజస్‌సాయి సమర్పించిన పరిశోధన కూడా ఉండడం గర్వకారణమన్నారు. దీనికి బయో కెమిస్ట్రీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశంత్ మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ ఎంపిక కళాశాలలో పరిశోధనా సంస్కృతిని మరింత పెంచేందుకు దోహదం చేస్తుందన్నారు.
డీసీసీబీలో ఇంటర్వ్యూలు
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో బ్యాంకు ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న పరిపాలనా కార్యాలయంలో బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రెండు మేనేజర్ పోస్టులు, ఐదు అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు చేశారు. ఎంపికై న వారికి త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శ్రీనివాసరావు, ఆఫ్కాబ్ ఏజీఎం రామచంద్రయ్య, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
లారీని తప్పించబోయి కారు బోల్తా
● ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో
తప్పిన ప్రాణాపాయం
మనుబోలు: నెల్లూరు నుంచి గూడూరు వైపు వస్తున్న కారు మండల పరిధిలోని పొదలకూరు క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం ప్రమాదానికి గురైంది. రహదారిపై హఠాత్తుగా ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొని బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు.
గాయపడిన వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం చైన్నెకు తరలిస్తుండగా మృతిచెందారు. సౌత్ ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు.. మనుబోలు మండలం బద్దెవోలుకు చెందిన సునీల్(42)కు భార్య, పిల్లలున్నారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద సునీల్ సోమవారం ఆటో ఎక్కారు. అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు ఆటో నుంచి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆయన్ను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆయన్ను చైన్నెకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ మేరకు మృతుని తండ్రి గోపాలయ్య సౌత్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
చిల్లకూరు(గూడూరు): మండలంలోని ముత్యాలపాడు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. ముత్యాలపాడు గ్రామానికి చెందిన నివాస్, హరినాథ్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై గూడూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా గొర్రెల సంత వద్ద ముందు వెళ్తున్న బస్సును అధిగమించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎదురుగా గూడూరు వైపు వస్తున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో చికిత్స నిమిత్తం గూడూరుకు తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.


