● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను అనుమతించకుండా కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసు అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాలు తరచూ జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. హైవేలపై రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ వివరాలను పోలీసులకు అందించాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించేందుకు సహకరించిన వారికి అందించే గుడ్ సమారిటన్ ప్రోత్సాహకాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రుల వివరాలను నమోదు చేసి, పోలీసుల సహకారంతో రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఆక్రమణలు తొలగించాలి
నగరంలోని మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్, స్టోన్‌హౌస్‌పేట వంటి ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్లలో ఆక్రమణలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ప్రైవేట్ బస్సుల పార్కింగ్ కోసం సర్వోదయ కళాశాల గ్రౌండ్, కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని దేవదాయ శాఖకు చెందిన ఖాళీ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా నిలుపుకోవాలని సూచించారు. కావలి సమీపంలోని ట్రక్ రెస్ట్ ఏరియా సమాచారాన్ని తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలుత డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చందర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, డీఆర్వో విజయ్‌కుమార్, కమిషనర్ నందన్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


