చలో కలెక్టరేట్‌ రణరంగం | - | Sakshi
Sakshi News home page

చలో కలెక్టరేట్‌ రణరంగం

Aug 19 2026 12:00 AM | Updated on Aug 19 2026 12:00 AM

తొమ్మిది మంది ఏఐటీయూసీ నేతల అరెస్ట్‌

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ

చూడలేదంటూ నినాదాలు

నెల్లూరురూరల్‌: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ నేతలు నెల్లూరులో నిర్వహించిన చలో కలెక్టరేట్‌ రణరంగాన్ని తలపించింది. నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్‌ నుంచి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కలెక్టర్‌కు స్వయంగా వివరించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏఐటీయూసీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోకి వెళ్లాలని ప్రయత్నించిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొమ్మి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ షాన్‌వాజ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు మీరా ముక్తియార్‌, మహిళా సంఘం నాయకురాలు వనజ తదితరులు ఉన్నారు.

అన్నిరంగాల ఉద్యోగులకు నిరాశే

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో 12వ పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, గ్రాట్యుటీలను విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనే రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్‌ కూడా అనుసరిస్తోందని వాపోయారు. 40 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, ఇలాంటి ప్రభుత్వాన్ని, పోలీసులను చూడలేదంటూ నినదించారు. సీఎం డౌన్‌డౌన్‌, పోలీసు జులుం నశించాలనే నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి ఎస్డీ సిరాజ్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, లీలామోహన్‌, ఆంజనేయులు, మహీంద్రా, పెంచాలయ్య, శిరీష, మల్లి అంకయ్య, పాముల శ్రీను, మున్నా, సుబ్బారాయుడు తదితరులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement