స్థానిక ఎన్నికల్లో గెలుపునకు చంద్రబాబు కుట్రలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో గెలుపునకు చంద్రబాబు కుట్రలు

Oct 4 2026 11:51 PM | Updated on Oct 4 2026 11:51 PM

● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌

చిల్లకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలుపొందే సత్తా లేక దొడ్డిదారిలో గెలిచేందుకు చంద్రబాబు కొత్త కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ అన్నారు. గూడూరులోని సనత్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరిగ రేవంత్‌ చక్రవర్తితో కలిసి విలేకరుల సమావేశంతో మాట్లాడారు. చంద్రబాబు ఏనాడూ నేరుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన దాఖలాల్లేవన్నారు. నేడు కూడా ఎన్నికలను నిర్వహిస్తేనే కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులు అందే వీలుండటంతో వాటిని సాకుగా చూపి ఎన్నికలకు వెళుతున్నామని పలుమార్లు ప్రకటనలు చేశారన్నారు. మరి నేడు బీసీల రిజర్వేషన్‌ పేరుతో మరోసారి ఎన్నికలకు ముఖం చాటేసేందుకు కోర్టుకు వెళుతున్నట్లు ప్రకటించడం చూస్తుంటే అధికార పార్టీలో ధైర్యం కనిపించడం లేదన్నారు. కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులను రెండేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం వాడుకుందని చెప్పడం చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దలు ముందున్నారని విమర్శించారు.

టీడీపీలో ఆర్థికంగా

బలవంతులకే అవకాశాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్లను నేరుగా ఎంపిక చేసుకునే ప్రణాళికలను సిద్ధం చేయడం వెనుక ఆంతర్యం ఆర్థిక పరిపుష్టి ఉన్నవారికే అవకాశాలు కల్పించేలా చూస్తున్నారని, ఇది ఎన్నికలను పూర్తిగా అపహాస్యం చేయడమేనని మేరిగ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నేరుగా చంద్రబాబు ఏనాడూ అడుగులు వేయలేదని, దీనినే ఈ దఫా కూడా కొనసాగించేందుకు పావులు కదుపుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులతో మాట్లాడుతూ.. ఎక్కడా అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయడంతోపాటు కచ్చితమైన పోటీ పెట్టాలని ఆదేశించారని తెలిపారు. దీంతో క్షేత్రస్థాయి కేడర్‌లో కూడా ఉత్సాహం నెలకొందన్నారు. సమావేశంలో మేధావుల ఫోరం కన్వీనర్‌ నందవరం సుబ్బారావు, యూత్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement