● గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య
గూడూరురూరల్: ‘కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పని చేద్దాం’ అని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య అన్నారు. మంగళపూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు యద్దల నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రూరల్ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులతో సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చేపట్టాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త, నాయకులతో నేరుగా మాట్లాడి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించడం జరుగుతుందన్నారు. మండల స్థాయి సమావేశాల అనంతరం గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకుని అడుగులు వేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో పలు రకాల వాగ్దానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అయితే వాటిని జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్ నాయకులు చేవూరు విజయమోహన్‌రెడ్డి, మండలంలోని అన్ని పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


