నెల్లూరు(అర్బన్): రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) నెల్లూరు సర్కిల్ కార్యాలయం (నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం) కక్షసాధింపు రాజకీయాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతులు, బదిలీల విషయంలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు.. పదేళ్లుగా సూపరింటెండెంట్‌లుగా పనిచేస్తున్న ముగ్గురికి చట్టానికి విరుద్ధంగా రివర్షన్ ఇచ్చి ఆగస్టులో సీనియర్ అసిస్టెంట్లు నియమించిన చరిత్ర సర్కిల్ కార్యాలయానికే దక్కింది. ఆర్‌అండ్‌బీలో రోస్టర్ లేకుండా నియామకాలు చేపట్టడం, ప్రమోషన్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, కారుణ్య నియామకాలలో కనికరం చూపకపోవడంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
చట్టానికి విరుద్ధంగా రివర్షన్‌లు
ఒక ఉద్యోగి ఒక కేడర్‌లో మూడేళ్లు పనిచేసి ఉంటే నేరుగా రివర్షన్ ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. అందుకు సంబంధించిన జీఓ కూడా ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే ముందుగా ఉద్యోగికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలి. అతను చేసిన తప్పులను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపాలి. దానిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిన అనంతరం ఉద్యోగి తప్పు చేసినట్లు తేలితే షోకాజ్ నోటీసు ఇచ్చి వారం రోజుల సమయం ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించడం లేదా ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఎన్‌ఎంఆర్‌లను తొలగించాలన్నా 24 (ఎఫ్) ప్రకారం నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుని, దానిపై సంతృప్తి చెందకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే నెల్లూరు ఆర్‌అండ్‌బీ సర్కిల్ కార్యాలయంలో ఇవేవీ పాటించలేదు. ఆగస్టు 31న మార్కాపురం డివిజన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి.కోమలికి రివర్షన్ ఇచ్చి సీనియర్ అసిస్టెంట్‌గా బాపట్లకు మార్చారు. ఒంగోలు ఆర్‌అండ్‌బీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి.లక్ష్మీకుమారిని, కావలి ఆర్‌అండ్‌బీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌కే అలీ అస్గర్‌కు రివర్షన్ ఇచ్చి సీనియర్ అసిస్టెంట్లుగా నెల్లూరు సర్కిల్‌కు మార్చారు. అలీ అస్గర్ డిప్యూటేషన్‌పై ఏపీ టూరిజంకు వెళ్లిపోయాడు. పదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. జీతం కూడా ఏపీ టూరిజం నుంచే పొందుతున్నాడు. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు ఆయనపై కూడా వేటు వేశారు.
జేఏసీ నాయకులు చెప్పినా..
రివర్షన్ విషయంలో ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి వివరించారు. చట్ట ప్రకారం మూడేళ్లు దాటిన వారిని రివర్షన్ చేయకూడదని చెప్పడంతోపాటు అందుకు సంబంధించిన కాపీలను చూపించినా ఎస్‌ఈ పట్టించుకోలేదంటున్నారు.
రోస్టర్ పాయింట్ లేకుండా..
ఆర్‌అండ్‌బీ నెల్లూరు సర్కిల్ కార్యాలయంలో 1993 వరకు రోస్టర్ పాయింట్ల రిజిస్టర్ ఉండేది. అనంతరం దానిని అక్కడి ఉద్యోగులు ఎవరో మాయం చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎంత మంది ఎస్‌ఈలు మారినా రోస్టర్ పాయింట్ల రిజిస్టర్ తయారు చేయలేదు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, ప్రమోషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. రోస్టర్ పాయింట్లు లేకుండా రివర్షన్‌లు కూడా ఇవ్వకూడదు. అయినా ఈ శాఖలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటీవల జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఈ విషయం తెలిసి.. రోస్టర్ పాయింట్ రిజిస్టర్ లేకుండా ఎలా పనిచేస్తున్నావంటూ ఎస్‌ఈపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఎవరికోసం ఇదంతా?
తామనుకున్న వారిని సూపరింటెండెంట్‌లుగా నియమించుకునేందుకు కక్షకట్టిన అధికారులు పై ముగ్గురు సూపరింటెండెంట్లకు రివర్షన్‌లు ఇచ్చారనే ప్రచారం జోరందుకుంది. కాగా ఆ ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వెంటనే నెల్లూరు సర్కిల్ ఎస్‌ఈకి మొట్టికాయలు వేసి రివర్షన్‌ను రద్దు చేసింది. దీంతో చేసేదేమీ లేక గత వారంలో మళ్లీ వారిని సూపరింటెండెంట్‌లుగా నియమిస్తూ ఎస్‌ఈ ఆదేశాలు జారీ చేశారు.
కారుణ్య నియామకాలపై..
సొంత శాఖలో చిరుద్యోగులు మరణిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అధికారులు నియామకాలకు మోకాలడ్డుతున్నారనే ఆరోపణలున్నాయి. భర్త మరణించి ఒకటిన్నర సంవత్సరమైనా ఉద్యోగం ఇవ్వకపోవడంతో తుపాకుల వెంకటరమణమ్మ అనే ఎస్టీ మహిళ గత నెలలో నిరాహారదీక్ష చేశారు. దీంతో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. ఇదే బాటలో జియావుల్ హక్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు. కలెక్టర్ తక్షణమే కారుణ్య నియామకం చేపట్టాలని కోరినా అధికారులు లెక్క చేయడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే సీనియర్ అసిస్టెంట్ సంతకం పెట్టడం లేదని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పేర్కొనడం గమనార్హం. అలాగే రివర్షన్‌ల ఫైలుపై అదే సీనియర్‌అసిస్టెంట్ సంతకం పెట్టలేదు. అయినా నేరుగా ఎస్‌ఈ సంతకం పెట్టి పై ముగ్గురికి రివర్షన్ ఇచ్చారు.
ఉద్యోగుల డిమాండ్
కోవూరులో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ శుక్రవారం నేరుగా ఎస్‌ఈ కార్యాలయానికి వచ్చి ఏ–5 సీటుకు సంబంధించిన బీరువా తీసి ఫైళ్లను పరిశీలించారు. ఆరోజు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కూడా కార్యాలయానికి రాలేదు. ఎవరి అనుమతి లేకుండా ఆమె ఎలా చేయగలుగుతుందో ఉద్యోగులకు సైతం అర్థం కాలేదు. ఏ–5 కీలకమైన సీటు అని, అందులో ఉద్యోగుల సర్టిఫికెట్లు ఉంటాయి. అవి పోతే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక ఆ సీటు బాధ్యతలు చూస్తున్న జాకీరుద్దీన్ అనే వ్యక్తి గత వారంలో గుండె వ్యాధితో మృతిచెందినట్లు చెబుతున్నారు. ఒక గ్రూపు ఉద్యోగులు అక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఏఎన్‌సీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఆర్‌అండ్‌బీ సర్కిల్లోని అవినీతి, అక్రమాలను సరిదిద్దాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ముగ్గురు సూపరింటెండెంట్లకు
రివర్షన్‌లు
కోర్టు ఆదేశాలతో తిరిగి
అదే పోస్టుల్లో నియామకం
రోస్టర్ పాయింట్
రిజిస్టర్ లేకుండానే వ్యవహారాలు
కారుణ్య నియామకాలపైనా
ఉద్యోగుల ఆరోపణలు
ఎస్‌ఈ తీరుపై జేఏసీ నాయకుల అభ్యంతరం


