● ఐదుగురి అరెస్ట్
బద్వేలు అర్బన్: పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులో ఫ్లైఓవర్ కింద తనిఖీలు నిర్వహించి 2.1 కిలోల గంజాయితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. స్థానిక అర్బన్ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దొడ్డేటిపల్లి రమణయ్య వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. బద్వేలును అడ్డాగా చేసుకుని కిలో రూ.6 వేల చొప్పున ఇతర నిందితులకు విక్రయిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం ద్వారా ఒక్కొక్కరికి 250 గ్రాముల చొప్పున తూకం వేసి విక్రయిస్తుండగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. రమణయ్యతో పాటు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన షేక్.చిన్నమీరావలీ, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలేపాడు గ్రామానికి చెందిన వలేరి మల్లికార్జున, బద్వేలు పట్టణం మార్తోమానగర్‌కు చెందిన వల్లెపు వెంకటసుబ్బయ్య, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం పెద్దఇర్లపాడు గ్రామానికి చెందిన నాగులూరి రాజమ్మను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో చిన్నమీరావలీ, రాజమ్మపై గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్సైలు యూవై జయరాములు, ఎం.రంగారావు, ఏఎస్సై శ్రీనివాసమూర్తి, హెడ్‌కానిస్టేబుల్ శివయ్య, కానిస్టేబుళ్లు కె.సుబ్బయ్య, ఎం.సుబ్బయ్య, మహిళా కానిస్టేబుల్ కల్యాణి పాల్గొన్నారు.


