విధుల పేరిట వేధింపులు | - | Sakshi
Sakshi News home page

విధుల పేరిట వేధింపులు

Aug 19 2026 12:00 AM | Updated on Aug 19 2026 12:00 AM

వైద్యాధికారిపై సీహెచ్‌ఓ ఫిర్యాదు

అదనపు డీఎంహెచ్‌ఓ విచారణ

సిబ్బంది వాంగ్మూలాల నమోదు

బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి డాక్టర్‌ అహ్మద్‌బాషా విధుల పేరుతో వేధింపులకు పాల్పడడంపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ) శివప్రియ చేసిన ఆరోపణలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ సునీత జొన్నవాడ పీహెచ్‌సీని సందర్శించి పలువురు ఉద్యోగుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది.

అధిక పనిభారం..

చిత్రహింసలు, అవమానాలు

తనపై ఉద్దేశపూర్వకంగా అధిక పనిభారం మోపుతున్నారని, విధులకు సంబంధంలేని అదనపు పనులను సైతం అప్పగిస్తున్నారని సీహెచ్‌ఓ శివప్రియ ఆరోపించారు. ఉన్నతాధికారుల స్థాయిలో నిర్వహించాల్సిన డేటా సేకరణ, హెల్త్‌ యాప్‌ పర్యవేక్షణ తదితర పనులను కూడా సిబ్బందితో చేయిస్తున్నారన్నారు. సెలవులు కోరిన సమయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రశ్నిస్తే చిత్రహింసలు, అవమానాలకు గురిచేస్తున్నట్లు ఆమె విచారణాధికారికి ఫిర్యాదు చేశారు.

అనారోగ్య సమయంలోనూ ఒత్తిడి

తాను గర్భంతో ఉన్న సమయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరించడంతో పాటు అధిక పనిభారం మోపారని శివప్రియ ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయాలను ప్రశ్నించినప్పటి నుంచి విజిటింగ్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సమావేశాలకు హాజరు కావాలని ఒత్తిడి చేశారని, హాజరు కాకపోతే మెమోలు జారీ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఏఎన్‌ఎంలను రెచ్చగొట్టి సిబ్బంది మధ్య విభేదాలకు కారణమవుతున్నారని, కొందరు అనుకూల సిబ్బంది విధులకు గైర్హాజరైనా పట్టించుకోవడం లేదని, ప్రశ్నిస్తే టెర్మినేషన్‌ చేస్తామని బెదిరించడం, మెమోలు జారీ చేయడం వంటి చర్యలతో ఇబ్బంది పెడుతున్నట్లు శివప్రియ అధికారులకు వివరించినట్లు తెలిసింది. శివప్రియ ఫిర్యాదులోని అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అదనపు డీఎంహెచ్‌ఓ సునీత తెలిపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement