వెంకటాచలం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన భగవాన్ శ్రీవెంకయ్యస్వామి 44వ ఆరాధన మహోత్సవాలు మండలం గొలగమూడిలో మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున గోపూజ, గణపతి పూజ, స్వస్తి వాచనం, అంకురార్పణ, దీక్ష వస్త్రధారణ, కంకణధారణ, కలశస్థాపన, శిఖర సంప్రోక్షణలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు సర్వభూపాల వాహనసేవ గావించారు. తొలుత వెంకయ్యస్వామిని వాహనంపై ఆశీనులు చేసి ప్రత్యేక పూలాలంకరణ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామంలోని అన్నివీధుల్లో ఉత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం వెంట భక్తులు పాల్గొని ఓం నారాయణ.. ఆది నారాయణ అంటూ భజనలు చేశారు. చిన్నారులు, మహిళలు కోలాట ప్రదర్శన చేపట్టారు. గ్రామోత్సవంలో మహిళలు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి నిర్వహించిన కల్ప వృక్ష వాహనసేవ కనుల పండువగా సాగింది. గొలగమూడి గ్రామస్తులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
ఆరాధనోత్సవాల్లో నేడు
వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు. అలాగే రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనసేవ నిర్వహిస్తారు.
● వెంకయ్యస్వామి ఆశ్రమాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.


