నెల్లూరు సిటీ.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఇక్కడ జరుగుతున్న
అవినీతికి అంతు లేకుండా పోయింది. ఇందుకు రోడ్ల నిర్మాణాలే నిదర్శనం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), సురక్షిత తాగునీటి సరఫరా పనుల పేరుతో ఇష్టానుసారంగా రహదారులను తవ్వేశారు. కొత్తవి వేసే సమయంలో నాణ్యతకు పాతరేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
నెల్లూరు(బారకాసు): 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో యూజీడీ, సురక్షిత తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌లను రూ.1,137.62 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఇందులో రూ.995 కోట్లు హడ్కో నుంచి రుణంగా మంజూరు కాగా, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా 2030లోపు నగరపాలక సంస్థ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ప్రతి మూడు నెలలకోసారి అసలు, వడ్డీ కలిపి రూ.30 కోట్లు, అంటే నెలకు రూ.10 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తం ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో వసూలు చేసిన నిధుల నుంచే చెల్లిస్తున్నారు
ఎప్పటికి అవుతాయో..
నగర పాలక సంస్థ పరిధిలో 427 కిలోమీటర్ల మేర యూజీడీ, 650 కిలోమీటర్ల మేర సురక్షిత తాగునీటి సరఫరా పైప్‌లైన్ పనులు చేపట్టారు. ఇందులో యూజీడీ పనులు 410 కి.మీ. మేర పూర్తయ్యా యని, మిగిలిన 17 కి.మీ. పనులు త్వరలో పూర్తవుతాయని ప్రజారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే సురక్షిత తాగునీటి సరఫరా పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని, ప్రజలకు ఇవ్వాల్సిన కుళాయి కనెక్షన్లలో ఇప్పటికే అధిక శాతం పూర్తి చేశామని, మిగిలినవి కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే పనులు ప్రారంభించి పదేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాకపోవడంపై నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల పనుల వల్ల నగరంలోని అధికశాతం అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో గుంతలు నీటితో నిండిపోవడంతో ఎక్కడ రోడ్డు, ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఆగుతూ.. సాగుతున్న యూజీడీ పనులు
అంతర్గత రోడ్లు అధ్వానంగా
మారడంతో ప్రజలకు ఇబ్బందులు
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం
15 రోజులకే పగుళ్లు, కుంగిపోయిన రహదారి
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే
కారణమంటున్న ప్రజలు


