తాత్కాలిక మరమ్మతులు చాల్లే.. | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక మరమ్మతులు చాల్లే..

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

సైఫన్‌ అక్విడెక్ట్‌ ధ్వంసమై పదిరోజులు

తాత్కాలిక పనులు చేపట్టి వదిలేసిన ఇరిగేషన్‌ శాఖ

శాశ్వత పునర్నిర్మాణంపై

స్పష్టత లేక రైతుల ఆందోళన

సంగం: మండలంలోని మర్రిపాడు సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫన్‌ అక్విడెక్ట్‌ ధ్వంసమై పదిరోజులు గడిచింది. ఇప్పటి వరకూ శాశ్వత మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం కాకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన సాగునీటి నిర్మా ణం దెబ్బతిన్నప్పటికీ కూటమి ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ అధి కారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారే తప్ప శాశ్వత పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శిస్తున్నారు.

ఏం జరిగిందంటే..

గత నెల 26వ తేదీన అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్విడెక్ట్‌ దెబ్బతినడంతో భారీగా సాగునీరు వృథా అయింది. కాలువ నుంచి పెద్దఎత్తున నీరు బయటకు వెళ్లడంతో సమీపంలోని పంట పొలాలు నీటమునిగాయి. ఓవైపు విలువైన సాగునీరు వృథా కావడంతోపాటు, మరోవైపు పంటలకు నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మొత్తం ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే శాశ్వత మరమ్మతులకు సంబంధించిన సాంకేతిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సిన అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు పేర్కొంటున్నారు. పది రోజులు గడిచినా పూర్తి స్థాయి మరమ్మతులకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ కనిపించకపోవడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా చెబుతున్నారు

ఘటన అనంతరం హడావుడిగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ, శాశ్వత పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు మాత్రం ఇప్పటికీ సిద్ధం కాలేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు మాత్రం ప్రస్తుతం కాలువలో నీటి విడుదల కొనసాగుతున్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని, నీటి విడుదల పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపడతామని చెబుతున్నారు. అయితే ఆ పనులకు అవసరమైన ప్రతిపాదనలే ఇంకా సిద్ధం కాకపోవడంతో పున ర్నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు, అక్విడెక్ట్‌ ధ్వంసానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇప్పుడు శాశ్వత మరమ్మతుల పేరుతో భారీ అంచనాలు రూపొందించి రూ.లక్షలు ప్రభుత్వ నిధులను ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, అనంతరం పారదర్శకంగా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా శాశ్వత పునర్నిర్మాణ పనులు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయడంతో పాటు, అక్విడెక్ట్‌ ధ్వంసానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement