యూజీడీ, సురక్షిత తాగునీటి సరఫరా పనులు పూర్తయిన ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్ల పునర్నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలున్నాయి. పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే గుర్తించింది. ఇటీవల మైపాడు రోడ్డులో యూజీడీ, తాగునీటి పైప్‌లైన్ పనులు పూర్తైన అనంతరం చేపట్టిన సీసీ రోడ్డు ప్యాచ్‌వర్క్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. దీనిపై గత నెల 27వ తేదీన ‘ఇష్టారాజ్యంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. పనులు జరిగిన కొద్దిరోజులకే పగుళ్లు ఏర్పడి కుంగిపోయే అవకాశం ఉందని కథనంలో పేర్కొంది. తాజాగా అదే జరిగింది. మైపాడు రోడ్డులో చేపల మార్కెట్‌కు ఎదురుగా చేపట్టిన సీసీ రోడ్డు ప్యాచ్‌వర్క్ చేసిన ప్రాంతంలో కేవలం 15 రోజులకే రోడ్డు పగుళ్లు ఏర్పడి కుంగిపోయింది. సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.


