వ్యాధితో పోరాటం.. పింఛన్‌ కోసం నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

వ్యాధితో పోరాటం.. పింఛన్‌ కోసం నిరీక్షణ

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులపై కనికరం లేదా?

కొత్త పెన్షన్లు మంజూరు చేయని

కూటమి ప్రభుత్వం

దరఖాస్తు చేసుకున్న వారు 4,500 మంది

నెల్లూరు(అర్బన్‌): పొరపాటో.. గ్రహపాటో.. విధి వంచనకు గురై హెచ్‌ఐవీ – ఎయిడ్స్‌తో జీవనం సాగిస్తున్న వారి జీవితాలు దుర్భరంగా మారాయి. వారిలో పసిబిడ్డలున్నారు. భార్యాభర్తలు ఉన్నారు. వృద్ధులున్నారు. వ్యాధి నియంత్రణ కోసం ప్రతి నెలా ఖరీదైన మందులు వాడాల్సి వస్తోంది. పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే కుటుంబాన్ని పోషించేందుకు సరిపడా ఆదాయం లేక, శారీరకంగా బలహీనపడిన స్థితిలో అనేకమంది నిరుపేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి కొంతైనా ఆసరాగా సామాజిక పింఛన్లు ఉపయోగపడుతున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పింఛనూ మంజూరు కాకపోవడంతో అల్లాడిపోతున్నారు.

జిల్లాలో 19,359 మంది నమోదు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ) కేంద్రంలో ఇప్పటి వరకు 19,359 మంది హెచ్‌ఐవీ – ఎయిడ్స్‌ బాధితులు నమోదు చేసుకున్నారు. వారిలో 8,236 మంది క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 2,200 మంది సామాజిక పింఛన్‌ పొందుతుండగా, ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.

స్పందించరా?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో హెచ్‌ఐవీ – ఎయిడ్స్‌ బాధితులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. తొలిదశలో 1,700 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు కాలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశం కూడా కల్పించలేదు. రెండేళ్లుగా సుమారు 4,500 మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వ్యాధి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యానికి గురవుతున్న తమలాంటి నిరుపేదలను ఆదుకోవాలని బాధితులు కన్నీటితో వేడుకుంటున్నారు. పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతుగా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపించామని, పింఛన్ల మంజూరుపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

త్వరలోనే మంజూరు

ఏఆర్టీ కేంద్రానికి వచ్చే రోగులు అందజేసే దరఖాస్తులను అక్కడి డాక్టర్లు ఏపీ శాక్స్‌ అధికారులకు పంపుతారు. నెల్లూరు నుంచి కూడా అలాగే పంపి ఉన్నారు. ఏపీ శాక్స్‌ అధికారులు స్క్రూట్నీ చేసి అర్హత ఉన్న వాటిని సెర్ప్‌ అధికారులకు పంపారు. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి.

– డాక్టర్‌ ఖాదర్‌వలీ, జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ, టీబీ నివారణ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement