అంతా ‘తమ్ముడి’ ఇష్టం | - | Sakshi
Sakshi News home page

అంతా ‘తమ్ముడి’ ఇష్టం

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

నిబంధనలకు విరుద్ధమే..

చేజర్ల: మండలంలో రెవెన్యూ సేవలు పూర్తిగా గాడి తప్పినట్లు తెలుస్తోంది. వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు, దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలానికి చెందిన ఓ నియోజకవర్గ స్థాయి కీలక నేత కనుసన్నల్లోనే యంత్రాంగం పనిచేస్తోందని, ఆయన ఆశీస్సులు ఉంటే రెవెన్యూ శాఖలో చట్టవిరుద్ధమైన పనులు కూడా సాఫీగా జరిగిపోతాయనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

తీవ్ర జాప్యం

ప్రజల స్థిరాస్తులకు చట్టబద్ధత కల్పించడం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన హక్కులు, అనుభవం, ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటి అంశాల్లో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చేజర్ల మండలంలో ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో వారసత్వంగా వచ్చిన పొలాలను ప్రభుత్వ భూములుగా చూపించడం, ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాలకు చెందిన ఆస్తుల బదలాయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. కోటితీర్థం, బిల్లుపాడు, యనమదల, తిమ్మాయిపాలెం, పెరుమాళ్లపాడు, పెల్లేరు, చిత్తలూరు తదితర గ్రామాల్లో భూములకు సంబంధించిన సమస్యలు సంవత్సరాలు గడిచినా పరిష్కారం కాక దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక..

రెవెన్యూలో సమస్యలు ముందే ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షసాధింపు చర్యలతో పరిస్థితి మరింత దిగజారింది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ప్రభుత్వం కేటాయించిన భూములపై కూటమి నేతలు కన్నేసి ఆక్రమించుకుంటున్నారు. అన్ని ఆధారాలు, హక్కుల పత్రాలతో రెవెన్యూ అధికారులకు చెప్పినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కూడా ఫలితం లేక చివరకు డబ్బు ఖర్చు చేసి న్యాయస్థానాలను ఆశ్రయించి తమ భూములను కాపాడుకోవాల్సి వస్తోంది.

ప్రతి పనికి ఒక రేటు

చేజర్ల రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించిన ఏ పని చేయించుకోవాలన్నా ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించుకుని దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు ఉదాహరణగా గతంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన సంఘటనలను స్థానికులు గుర్తు చేస్తున్నారు. కొల్లపనాయుడుపల్లి గ్రామంలో పొజిషన్‌ సర్టిఫికెట్‌ కోసం నగదు డిమాండ్‌ చేసిన వీఆర్వోను, అలాగే ఏటూరు రెవెన్యూ పరిధిలో వారసత్వ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి నగదు డిమాండ్‌ చేసిన మరో వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరుసగా ఇలాంటి చర్యలు జరిగినప్పటికీ రెవెన్యూ అధికారుల్లో మార్పు కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు.

ఆయన చెబితే..

చేజర్ల రెవెన్యూ యంత్రాంగం ఓ నియోజకవర్గ స్థాయి టీడీపీ నేత కనుసన్నల్లోనే పనిచేస్తోందని విమర్శలున్నాయి. ఇక్కడ రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేరు. డీటీగా పనిచేస్తున్న వ్యక్తినే ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉన్నారు. ఈయన ప్రతి పనిలో తాయిలాలతోపాటు ఆ నేత సిఫార్సు ఉంటే ఎంతటి చట్టవిరుద్ధమైన పనైనా సులభంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

చేజర్లలో గాడి తప్పిన రెవెన్యూ సేవలు

ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

టీడీపీ నేత కనుసన్నల్లో యంత్రాంగం

సమస్యల పరిష్కారానికి కార్యాలయం చుట్టూ జనం ప్రదక్షిణలు

మండలంలో రెవెన్యూ పాలన గాడి తప్పిందనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. వ్యవసాయ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తులు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు, న్యాయస్థానం స్టే విధించిన భూములకు రక్షణ కల్పించాల్సిన సంబంధిత అధికారులే ప్రత్యర్థులతో చేతులు కలిపారు. సదరు భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కలెక్టర్‌ చేజర్ల మండల రెవెన్యూ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement