నెల్లూరు(అర్బన్): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. జూన్ నెల 15న జిల్లాలో ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. వాటిని ఓటర్లు భర్తీ చేసి ఈనెల 14లోపు తిరిగి అందజేయాల్సి ఉంది. ఆదివారం జిల్లాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని బీఎల్వోలు ఫోన్ చేసి ఓటర్లను కోరుతున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఈ ప్రక్రియలో నిమగ్నమైంది. ఓటర్లు ఫారాలు తిరిగి ఇవ్వకుంటే ఓటు గల్లంతు కావడం ఖాయం. భర్తీ చేసిన ఫారాలను బీఎల్వోలు డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత తయారు చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 21న అధికారులు ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ సవ్యంగా జరగాలంటే ఓటరు సందేహాలు వీడి తమ ఫారాలు అందజేసి ఓటు ఆన్‌లైన్ అయిందో లేదో పరిశీలించుకోవాలి.
సందేహాలకు ‘1950’ నంబర్
ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 1950కి ఫోన్ చేసి సహాయం పొందొచ్చు. ఉదాహరణకు నెల్లూరులో ఓట్లు ఉండి ఉద్యోగ, ఉపాధి రీత్యా ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఉన్నా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని బీఎల్వోల వద్దకు రావాల్సిన అవసరం లేదు. ఓటర్.సీసీఐ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే 1950కి ఫోన్ చేస్తే అధికారులే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలో ఫోన్ ద్వారానే వివరిస్తారు.
పొడిగింపు ఉండదా?
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆచరణలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజనులు, వలస వెళ్లిన వారు అందుబాటులో ఉండటం లేదు. పట్టణాల్లో అనేకమంది అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. వారు ఇళ్లు మారడంతో ఇబ్బందులు వచ్చాయి. ఉద్యోగం చేస్తూ ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారి చిరునామాలు కొన్ని దొరకడం లేదు. ఇంకా ప్రతిపక్షాల ఓట్లు తొలగింపునకు కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. చట్టానికి విరుద్ధంగా స్వయంగా మంత్రి నారాయణ బీఎల్వోలతో సమీక్ష జరపడమే దీనికి ఉదాహరణ. జీవించి ఉన్న వారిలో పలువురు ఇప్పటికీ ఓటర్లుగా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో సర్ గడువును పెంచాలని వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు ఎన్నికల సీఈఓను కోరుతున్నాయి. అయినా గడువును పెంచేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా లేదని ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ కూడా ఈ విషయంలో తనేమీ చేయలేనని ఎన్నికల సంఘం సీఈఓదే తుది నిర్ణయమంటూ పేర్కొంటున్నారు. అందువల్ల సర్ గడువుతో పనిలేకుండా ఈ రెండు రోజుల్లోనే ఓటర్లు తమ ఫారాలను పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలి.
తుదిదశకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ
డిజిటలైజేషన్ చేసినా మ్యాపింగ్ కాని ఓటర్లు
21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ
జిల్లా ఓటర్లు 19,74,240 మంది
జిల్లాలో ఇప్పటి వరకు 19,74,240 మంది ఓటర్లున్నారు. వారిలో 19,70,973 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి 99.83 శాతం ప్రగతి సాధించామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అంతేకాకుండా 17,80,562 మంది ఫారాలను డిజిటలైజేషన్ చేసి 90.19 శాతం ఆన్‌లైన్ చేశామన్నారు. డిజిటలైజేషన్ చేసినప్పటీకీ ఓటర్లు ఇచ్చిన ఫారాలతో 2002 ఓటర్ల జాబితాను పోల్చి చూస్తే పలువురు ఓట్లు మ్యాపింగ్ కావడం లేదు. దీంతో ఎన్ని ఓట్లు ఉంటాయో? ఎన్ని పోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఎన్ని ఓట్లు గల్లంతవుతాయో తెలుస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లక్షలాది ఓట్లు గల్లంతైన విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


