కత్తులతో ఇద్దరు వ్యక్తులపై దాడి | - | Sakshi
Sakshi News home page

కత్తులతో ఇద్దరు వ్యక్తులపై దాడి

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

నెల్లూరు సిటీ: నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై కొందరు కత్తులతో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆదివారం పోలీసులు వివరాలు వెల్లడించారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చైతన్య అనే యువకుడు ఉంటున్నాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. అతడికి బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉంది. కాగా ఆమె ఇటీవల వేదాయపాళెంలోని ఓ షాపులో ఉద్యోగంలో చేరింది. సదరు మహిళ, షాపు మేనేజర్‌ రఫీతో సన్నిహితంగా ఉన్నట్టు చైతన్య అనుమానం పెంచుకున్నాడు. చైతన్య అతని సోదరుడు తేజ మరికొందరు కలిసి రఫీ, అదే షాపులో పనిచేస్తున్న నూర్‌బాషాపై శనివారం రాత్రి వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ దారిలో కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

పెన్నా బ్రిడ్జి పైనుంచి పడి..

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరంలోని ప్రశాంతినగర్‌ నుంచి కావలి వైపు వెళ్లే మార్గంలో ఉన్న పెన్నా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆదివారం పోలీసులు వివరాలు వెల్లడించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బ్రిడ్జి పైనుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నలుపు రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. అతని కుడిచేతిపై శివుడు, కుడి ముంజేతిపై చక్రం గుర్తు, ఎడమచేతిపై మూడు నక్షత్రాల పచ్చబొట్లు ఉన్నాయి. అలాగే కుడిచేతిపై హిందీలో ‘దిన్‌’ అనే పదం పచ్చబొట్టుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ను లేదా 94407 96310, 94407 96306 నంబర్లను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేశారు.

12 సవర్ల బంగారం చోరీ

ఉదయగిరి: మండలంలోని గండిపాళెంలో ఓ మహిళ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామంలోని శివారు ప్రాంతంలో కోమిటి ఆదిలక్ష్మి అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం తిరిగొచ్చింది. ఇంట్లో బీరువా తెరిచి ఉండటాన్ని గమనించింది. అందులోని 12 సవర్ల బంగారంతోపాటు రూ.50 వేలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. దొంగలు ఇంటికి వెనుక వైపు ఉన్న తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి చోరీ చేసినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు.

యువకుడి బలవన్మరణం

కోవూరు: మండలంలోని కోవూరు సమీపంలోని ఎన్టీఎస్‌ గేట్‌ ప్రాంతంలో నివాసముంటున్న వేముల విజయ్‌ (25) అనే యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం స్థానికులు, పోలీసులు వివరాలు వెల్లడించారు. విజయ్‌ కూలీ పనులకు వెళ్తుంటాడు. వివాహం కాలేదు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement