జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
బిడ్డను చూసేందుకు వెళ్తూ..
నెల్లూరు సిటీ: అతడికి నాలుగు రోజుల క్రితం కుమార్తె పుట్టింది. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకున్నాడు. నారాయణ హాస్పిటల్లో ఉంటున్న తన భార్య, బిడ్డను చూసేందుకు స్కూటీపై వెళ్తుండగా నెల్లూరు – ముత్తుకూరు రోడ్డులో కారు వేగంగా ఢీకొనడంతో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని జెండా వీధికి చెందిన షేక్ నవాజ్ (35)కు ఇటీవల పాప పుట్టింది. శిశువును, భార్యను చూసేందుకు శనివారం అర్ధరాత్రి తన స్కూటీపై నారాయణ ఆస్పత్రికి బయలుదేరాడు. అతడి వెనుకనే మరో మోటార్‌బైక్‌పై తమ్ముడు షేక్ పర్వేజ్, అతని స్నేహితుడు వస్తున్నారు. ఆకుతోట వద్ద పీఎస్సార్ కల్యాణ మండపం సమీపంలో నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు స్కూటీపై వెళ్తుండగా వేగంగా కారు దూసుకొచ్చి నవాజ్ స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్రగాయమైంది. స్థానికులు క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. షేక్ పర్వేజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు
చిట్టమూరు: నాయుడుపేట – మల్లాం రహదారి మార్గంలో చిట్టమూరు మండల పరిధిలోని మొలకలపూడి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. చిట్టమూరు ఎస్సై కె.నాగరాజు కథనం మేరకు.. చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామానికి చెందిన శ్రీపతి గోపి, అతని భార్య లక్ష్మి (42) ఓజిలి మండలం రాజుపాళెం గ్రామానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి మోటార్‌బైక్‌పై బయలుదేరారు. పెళ్లకూరు మండల మోదుగులపాళెం గ్రామానికి చెందిన లోకేశ్ అనే వ్యక్తి వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కు వెళ్లి బైక్ తిరిగొస్తున్నాడు. రెండు బైక్‌లు మొలకలపూడి గ్రామ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. గోపీ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై నాగరాజు తెలిపారు.
సొంతూరికి బయలుదేరి..
కోవూరు: మండల పరిధిలోని పోతిరెడ్డిపాళెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ బీబీజాన్ (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రాపూరుకు చెందిన బీబీజాన్ బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలోని బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి సొంతూరికి వెళ్లేందుకు బంధువుల బైక్‌పై నెల్లూరుకు బయలుదేరింది. పోతిరెడ్డిపాళెం సమీపంలో వారి బైక్‌ను వెనుక నుంచి మరో బైక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో బీబీజాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై ముత్యాలరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


