మంత్రి చెప్పారు.. మమ్మల్ని ఆపేదెవరు..! | - | Sakshi
Sakshi News home page

మంత్రి చెప్పారు.. మమ్మల్ని ఆపేదెవరు..!

Jul 8 2026 12:27 AM | Updated on Jul 8 2026 12:27 AM

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌

పెన్నా నదిలో ట్రాక్టర్లలో ఇసుక నింపుతూ..

నెల్లూరు సిటీ: ఓవైపు ఇసుక తవ్వకాలపై నిషేధమున్నట్లు గనుల శాఖ అధికారులు ప్రకటించారు. అదేమీ తెలుగు తమ్ముళ్లకు పట్టడం లేదు. అధికారం ఉంది కదా అని యథేచ్ఛగా ట్రాక్టర్లలో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్లలో వద్దు.. ట్రాక్టర్లలో తీసుకెళ్లండి అని మా మంత్రే చెప్పారు.. ఇక ఆపేదెవరంటూ రెచ్చిపోతున్నారు. నెల్లూరు నడిబొడ్డున ఉండే బోడిగాడితోట వద్ద పెన్నానదిలో 25 నుంచి 30 ట్రాక్టర్లలో ఇసుకను మంగళవారం తెల్లవారుజామున నుంచి అక్రమంగా తరలించారు.

దారి ఏర్పాటు

బోడిగాడితోట శ్మశానవాటికకు సమీపంలో టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలించేందుకు ముందుగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌, ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్లకు ఇసుకను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ట్రాక్టర్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధరను నిర్ణయించారు. అంతా సిద్ధం చేసుకుని మంగళవారం తెల్లవారుజామున బోడిగాడతోట వద్దకు 25 నుంచి 30 ట్రాక్టర్లను నేతలు తీసుకెళ్లారు. 15 మంది కూలీలతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్రాక్టర్లలో ఇసుకను లోడింగ్‌ చేసి తరలించారు. మీడియా అక్కడికి చేరుకున్నా ఏ మాత్రం జంకు లేకుండా తమ పని తాము చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు వందల సంఖ్యలో ట్రిప్పులు వేయడం గమనార్హం. దీంతో పెన్నానదిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి.

నిషేధముంటే..

వర్షాకాల నేపథ్యంలో జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదని జిల్లా గనుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నెల్లూరు నగరంలోని తెలుగు తమ్ముళ్లకు మాత్రం పట్టడం లేదు. యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు.

మంత్రి చెప్పారంటూ..

మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్‌లో టిప్పర్లతో ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటానన్నారు. అయితే ట్రాక్టర్లలో ఇసుక తరలించుకోవచ్చని చెప్పడంతోనే ఇలా చేస్తున్నట్లు నేతలు చెప్పడం విశేషం. మంత్రి చెబితే అధికారులు కూడా మా జోలికి రాలేరన్న ధైర్యంతో బరితెగించారు. దీంతో సామాన్యులకు మాత్రమే నిబంధనలు.. టీడీపీ నేతలకు మాత్రం కాదని మరోసారి స్పష్టమైంది.

అక్టోబర్‌ 15 వరకు ఇసుక

తవ్వకాలపై నిషేధం

బోడిగాడితోట వద్ద పెన్నా నదిలో అక్రమంగా తవ్వకాలు

తెల్లవారుజాము నుంచి తరలిస్తున్న తెలుగు తమ్ముళ్లు

టిప్పర్లతో వద్దు, ట్రాక్టర్లలో తోలుకోండి

ఇటీవల టెలి కాన్ఫరెన్స్‌లో

మంత్రి నారాయణ సూచన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement