జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

Jul 8 2026 12:27 AM | Updated on Jul 8 2026 12:27 AM

నెల్లూరు సిటీ: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ మోడల్‌) తెస్తూ, ఫ్రంట్‌ ఆఫీసులు (రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు) ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు పట్నం దుర్గేష్‌బాబు కోరారు. నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ విజయరాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా దస్తావేజు లేఖరులు ఉన్నారన్నారు. వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పారు. జీఓ వల్ల ప్రైవేట్‌ సంస్థల హవా పెరిగి, దస్తావేజు లేఖరుల (డాక్యుమెంట్‌ రైటర్స్‌) జీవన భృతి దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం జీఓను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 81,692 మంది దర్శించుకున్నారు. 35,361 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమ ర్పించారు. టైం స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. అవి లేనివారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

విద్యుదాఘాతానికి గురై..

కోళ్ల వ్యాపారి మృతి

వాకాడు: విద్యుత్‌ షాక్‌కు గురై కోళ్ల వ్యాపారి మృతిచెందిన ఘటన మండలంలోని కొండాపురం పంచాయతీ వడ్డిపాళెంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వడ్డిపాళేనికి చెందిన మల్లి నాగరాజు (45) అనే వ్యక్తి స్థానికంగా చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజులాగే మంగళవారం దుకాణానికి వెళ్లాడు. చికెన్‌ డ్రెస్సింగ్‌ మెషీన్‌తో పనిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దుకాణానికి వచ్చిన వారు గుర్తించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. అతని మృతితో వడ్డిపాళెంలో విషాదం నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement