కార్మిక వర్గం రోడ్డున పడేలా పాలన | - | Sakshi
Sakshi News home page

కార్మిక వర్గం రోడ్డున పడేలా పాలన

Jul 8 2026 12:27 AM | Updated on Jul 8 2026 12:27 AM

వైఎస్సార్‌ టీయూసీ జిల్లా

అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి

నెల్లూరు(పొగతోట): కార్మిక వర్గాన్ని రోడ్డున పడేసేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్‌ టీయూసీ జిల్లా అధ్యక్షుడు బోడిలింగాలపాడు జయకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో సంస్థ రూ.2,500 కోట్ల మేర అప్పులు తీర్చుకోగలిగిందన్నారు. చంద్రబాబు, కూటమి నేతలు ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులపై కన్నేశారన్నారు. సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎనిమిది ఆర్టీసీ డిపోలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేలా జీఓలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

పరిశ్రమల మూసివేత

కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని జయకుమార్‌రెడ్డి అన్నారు. పైగా ఆ పార్టీల నాయకుల దందాలు, వేధింపుల కారణంగా ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. కార్మికులకు ఇస్తామన్న సంక్షేమ నిధి ఊసే లేదన్నారు. మార్కెటింగ్‌ శాఖ తీసుకొచ్చిన కొత్త ఈ – పర్మిట్‌ విధానంతో రైతులు తమ పంటను అనుకూలమైన ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కోల్పోయారని చెప్పారు. దీంతో రవాణా రంగంలోని డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టర్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విక్రయానికి పూర్తి మద్దతు ఇస్తూ కార్మికులను నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను, ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కార్మికులు, ప్రజా సంఘాలను ఏకం చేసి కూటమి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement