సీతారామపురం: మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమైనట్లు మాజీ సర్పంచ్ చింతనబోయిన దుర్గయ్య మంగళవారం ఎంపీడీఓ చెన్నారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయ్యే నాటికి బ్యాంక్ ఖాతాలో సుమారు రూ.3.70 లక్షలు ఉన్నాయన్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామంలో క్షేత్రస్థాయిలో పనులు చేపట్టకుండానే పంచాయతీ కార్యదర్శి మాల్యాద్రి కాగితాల్లో కాకి లెక్కలు చూపించి సుమారు రూ.1.60 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపించారు. తన హయాంలో రూ.5 లక్షల మేరకు అభివృద్ధి పనులు చేపట్టానని, వాటికి సంబంధించి ఎం బుక్‌లు రాసి బిల్లు పెట్టాలని కార్యదర్శిని కోరగా రాజకీయ విభేదాలను చూపిస్తూ దుర్భాషలాడినట్లు వాపోయారు. దీనిపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన ఎంపీడీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆరోపణలు రుజువైతే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


