● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ తిరిగాం. మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో వ్యయప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చాం. ఇక్కడైనా గోడు విని వాటిని పరిష్కరించండి’ అని ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ స్థాయిలో వచ్చారు. అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ప్రజల నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఇతర జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు.
టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు
నేను నడవలేను. ఎవరైనా ఎత్తుకుని కుర్చీలో కూర్బోబెడితే అలాగే ఉంటా. నాకు 88 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతం నుంచి నాకు రూ.4,000 పింఛన్ వస్తోంది. అయితే 80 శాతం కన్నా ఎక్కువ వికలత్వం ఉంటే రూ.15 వేలు పెన్షన్ ఇవ్వాలి. వైఎస్సార్‌సీపీ అభిమానులమని టీడీపీ వారు రూ.15 వేలు పింఛన్‌కు రాయకుండా రెండేళ్లుగా అడ్డుకున్నారు. కలెక్టర్ స్పందించి నాకు న్యాయబద్ధంగా రావాల్సిన విధంగా పింఛన్ రూ.15 వేలు ఇప్పించాలి. – పెద్ది కోటేశ్వరి, పద్మనాభసత్రం, కొడవలూరు మండలం
ఫ్యామిలీ పెన్షన్ రాకుండా చేశారు
మా అమ్మ ఆయుష్ విభాగంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తూ 2012లో రిటైర్డ్ అయ్యారు. 2020లో ఆమె మృతిచెందారు. నాకు పెళ్లి కాలేదు. ఏ ఆధారం లేని పెళ్లికాని సింగిల్ పర్సన్‌కు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే జీఓ ఉంది. అయినా ఆయుష్ శాఖ వారు ఆరేళ్లుగా పెన్షన్ ఫైలు నడపకుండా చేశారు. చిన్నపాటి సాంకేతిక కారణాలంటూ తిప్పుకొన్నారు. ఇప్పుడు ఆ శాఖలోని ఉద్యోగులు కూడా మారారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. – వడ్లపూడి మాధురి, నెల్లూరు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై..
ఆర్టీసీలో పీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఎంఓయూ ప్రకారం కాంట్రాక్టర్లు వేతనాలు ఇవ్వడం లేదు. ఇచ్చే వేతనాల్లో కూడా భారీ తేడాలున్నాయి. అందువల్ల కాంట్రాక్టర్‌ను కలెక్టర్ పిలిపించి సక్రమంగా వేతనాలు వచ్చేలా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులకు బ్యాంక్ ఖాతాల ద్వారానే జీతాలివ్వాలి. ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యసౌకర్యం కల్పించాలి. మహిళా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులివ్వాలి. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే మేనేజ్‌మెంట్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలి. ప్రతినెలా ఐదోతేదీలోపు జీతాలందేలా చూడాలి.
– యామాల మధు ఏఐటీయూసీ జిల్లా
కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అర్జున్
వేధిస్తున్నా చర్యల్లేవు
నేను ఏఎస్‌పేట మండలం చిరమన పీహెచ్‌సీలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఎఫ్‌ఎన్‌ఓగా పని చేస్తున్నాను. నేను, మరో కాంట్రాక్ట్ నర్సు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లేప్పుడు రొడ్డం నాగేంద్ర అనే వ్యక్తి వెంబడిస్తున్నాడు. తరచూ మాపై ఆర్టీఐ పెడుతున్నాడు. మాటలతో వేధిస్తున్నాడు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ కూడా కలెక్టర్‌కు తెలిపారు. ఆయన చర్యలు తీసుకోమని ఎస్పీకి తపాలా ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇలా పలుమార్లు జరిగినా పోలీసులు నాగేంద్రపై చర్యలు తీసుకోవడం లేదు. మాకు రక్షణ కల్పించాలి. – దొరసానమ్మ,
అవుట్ సోర్సింగ్ ఎఫ్‌ఎన్‌ఓ, ఆత్మకూరు


