ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

Jul 7 2026 12:21 AM | Updated on Jul 7 2026 12:21 AM

ఏపీ శాక్స్‌ జేడీ డాక్టర్‌ మంజుల

నెల్లూరు(అర్బన్‌): ఎయిడ్స్‌ రహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏపీ శాక్స్‌ జేడీ డాక్టర్‌ మంజుల పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరులోని డీఎఫ్‌ఐటీ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్‌, టీబీ నివారణాధికారి డాక్టర్‌ ఖాదర్‌వలీ అధ్యక్షతన ఐసీటీసీ, పీపీటీసీ, డీఎస్‌ఆర్‌సీ, ఏఆర్‌టీ కేంద్రాలు, ఎన్జీఓ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణైన వారిని తప్పనిసరిగా ఏఆర్‌టీ కేంద్రంలో నమోదు చేయాలని, ఇండెక్స్‌ టెస్టింగ్‌పై అవగాహన కల్పించాలని అన్నారు. హెచ్‌ఐవీ బాధితులకు సకాలంలో వైరల్‌ లోడ్‌ పరీక్షలు నిర్వహించి, ఫలితాలకు అనుగుణంగా మందులు అందించాలని సూచించారు. అలాగే హెచ్‌ఐవీ ఉన్న గర్భిణుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ సకాలంలో పరీక్షలు, చికిత్సతోపాటు మానసికంగా ధైర్యం కలిగించేలా కౌన్సెలింగ్‌ అందించాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ సుజాత మాట్లాడుతూ అధికారులు, ఎన్జీఓలు సమన్వయంతో పనిచేసి ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

పెద్దాస్పత్రి

సెక్యూరిటీ గార్డుపై దాడి

పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు(అర్బన్‌): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకయ్యపై ఓ రోగి బంధువు దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడ్మిషన్‌ వార్డులో ఓ కుటుంబానికి చెందిన సీ్త్ర, పురుషుడు వాదోపవాదాలు వేసుకుంటూ అరుస్తున్నారు. డ్యూటీలో ఉన్న వెంకయ్య అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకోవడం, సాటి రోగులకు ఇబ్బంది పెట్టడం సరికాదని సర్ది చెప్పాడు. ఏదైనా ఉంటే బయటకు వెళ్లి మాట్లాడుకోవాలన్నాడు. బయటకు వెళ్లమని చెప్పడంతో కోపోద్రిక్తుడైన రోగి అటెండర్‌ కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి వెంకయ్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అతను కిందపడ్డాడు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. రోగులు భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ వారు తమ ఇన్‌చార్జి రమణయ్యకు తెలిపి ఆయన సహకారంతో దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకా కేసు నమోదు చేయలేదు. ఓ లాయర్‌ వచ్చి రాజీ చేసుకోవాలని సెక్యూరిటీ గార్డుకు సూచించినట్టు సమాచారం. లేకుంటే ఇబ్బంది పడతారని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా డ్యూటీలో ఉన్న తమపై చేయిచేసుకోవడంపై సెక్యూరిటీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తమకు రక్షణ లేకపోతే విధులు ఎలా నిర్వర్తించాలని ఆవేదన చెందుతున్నారు.

ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు

ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ‘ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ పోలీస్‌ కేసులు బనాయిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే ఉద్యమాలు తప్పవు’ అని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ మున్నా హెచ్చరించారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్నా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులు, యూట్యూబర్లు, సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో అరెస్ట్‌ చేయటం సరికాదన్నారు. ప్రశ్న రావణ్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేశారన్నారు. తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిస్థితులపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు రామరాజు, జిలానీఖాన్‌, గౌస్‌బాషా, బాదుల్లా, నాగూర్‌, మనోహర్‌, అశోక్‌, మస్తాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement