● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 136 వినతుల అందజేత
నెల్లూరు(క్రైమ్): భర్త మృతిపై లోతుగా దర్యాప్తు చేయాలి. భర్త మృతిచెందడంతో అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటిగాథ. సమస్యలను పరిష్కరించాలని వారు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 136 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత వేజెండ్ల ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. వినతులు పునరావృత్తం కాకుండా చట్టపరిధిలో విచారించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్, డీటీసీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, మహిళా పోలీస్‌స్టేషన్, కంట్రోల్‌రూమ్, ఎస్‌బీ – 1, 2 ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, జి.దశరథరామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● హైదరాబాద్‌కు చెందిన కృతిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసగించిందని ఏఎస్‌పేటకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నా భర్త వ్యవసాయాధికారిగా పనిచేస్తూ జూన్ 15వ తేదీన అనుమానాస్పదంగా మరణించాడు. దానిపై లోతుగా దర్యాప్తు జరిపి అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు.
● నా భర్త మృతిచెందాడు. పెద్ద కుమారుడు, కోడలు నా ఆస్తిని వారి పేరుపై రాయించుకున్నారు. అంతటితో ఆగకుండా మానసికంగా వేధిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలని రాపూరు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు అర్జీ ఇచ్చారు.
● నా భర్త చనిపోయాడు. బీమా డబ్బులు వచ్చాయి. వాటిని ఇచ్చేయాలని అత్తింటివారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని కావలికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.


