● ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధర్నా
నెల్లూరు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.త్రివిక్రమ్, వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం డీఆర్వో విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా విద్యారంగ సమస్యల పరిష్కారానికి సరైన ప్రణాళిక విడుదల చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయనందున సెమిస్టర్ పరీక్షల సందర్భంగా హాల్‌టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. నూతన విద్యార్థులకు ప్రవేశపెట్టే ముఖ ఆధారిత హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్)తో తీవ్రంగా నష్టపోతారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండే వారికి రూ.3 వేలకు మెస్ చార్జీలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సుమంత్, యశ్వంత్, ముజమిల్, బాలు, అస్మత్, పవన్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.


