● డీఏహెచ్‌ఓ డాక్టర్ రమేష్ నాయక్
నెల్లూరు(వేదాయపాళెం): పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె. రమేష్ నాయక్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా సోమవారం నెల్లూరులోని వెటర్నరీ పాలి క్లినిక్ ప్రాంగణంలో ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించారు. రమేష్ నాయక్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 31,100 డోసుల యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను అన్ని ప్రభుత్వ పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ కుక్కలు, పిల్లులు తదితర పెంపుడు జంతువులకు ప్రతి ఏడాది తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వి.సుజాత, నారాయణ డెంటల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కణ్ణన్, ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ కార్యదర్శి ఉమాదేవి, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.జయప్రకాష్, డాక్టర్ జి.కృష్ణమూర్తి, డాక్టర్ జె.చైతన్య కిశోర్, జేవీఓ ఎం.అరుణ, పొదిలి శ్రీనివాసులు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


