నిబంధనలకు విరుద్ధంగా ఖాతా ఓపెన్‌ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు విరుద్ధంగా ఖాతా ఓపెన్‌

Jul 7 2026 12:21 AM | Updated on Jul 7 2026 12:21 AM

ఉదయగిరి: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద చేపట్టిన పనులకు కొత్తగా మళ్లీ బిల్లులు పెట్టి నిధులు కాజేసిన విషయం వారం రోజుల క్రితం వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ చేపడుతుండగానే తాజాగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరైన నిధులను పనులు చేయకుండానే అప్పనంగా దిగమింగిన విషయం వెలుగులోకి వచ్చింది. సమగ్ర శిక్షలో పనిచేసే పలువురు ఉద్యోగులు సిండికేట్‌గా ఏర్పడి ప్రజాధనాన్ని దోచేశారు. ఈ అవినీతి వ్యవహారంలో పలువురు చిన్నస్ధాయి ఉద్యోగుల నుంచి ముఖ్యఅధికారి వరకు పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అవినీతికి పునాది ఇలా..

జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్యన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2.59 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాలల్లో భవనాల కు మరమ్మతులు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణ పనులు చేపట్టారు. ఆయా పనులకు రూ.1.55 కోట్ల మేర చెల్లించారు. ఈ చెల్లింపులు అన్నీ స్కూల్‌ ఖాతాల నుంచి జరిగాయి. అగిపోయిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించే నిమిత్తం 2024లో సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వివరాలు కోరింది. ఇక్కడే అవినీతికి పునాది పడింది.

పక్కాగా స్కెచ్‌

జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేసే అవుట్‌ స్సోరింగ్‌ ఉద్యోగి, మరి కొంతమంది సైట్‌ ఇంజినీర్లు, కార్యాలయంలోని ఒకరిద్దరు సిబ్బంది, ముఖ్యఅఽధికారి కలిసి నిధుల దోపిడీకి పక్కాగా స్కెచ్‌ వేశారు. గతంలో చేసిన పనులకే మళ్లీ బిల్లులు పెట్టే ఆలోచన చేశారు. సుమారు రూ.కోటి వరకు బకాయిలు ఉన్నట్లు స్టేట్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

అవినీతిలో పలువురు ఉద్యోగుల పాత్ర

ఈ అవినీతి వ్యవహారంలో జిల్లాలో విఽవిధ మండలాల్లో పనిచేస్తున్న ఏడుగురు సైట్‌ ఇంజినీర్లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముందుగానే ఏపీసీతో అవగాహనకు వచ్చి చేసిన పనులకు మళ్లీ బిల్లులు పెట్టారు. ఏపీసీ, ఈఈ ఉమ్మడి ఖాతా నుంచి తన బినామీలతో చెక్కుల ద్వా రా నిధులు డ్రా చేశారు. ఈ పరంపరలో మనుబోలులో పనిచేసిన ఓ మహిళా సైట్‌ ఇంజినీర్‌(ప్రస్తుతం ఉద్యోగానికి రాజీనామా చేశారు) తన భర్త పేరుతో 2025 ఏప్రిల్‌ 5న రూ.14.32 లక్షలు డ్రా చేయడం వెలుగుచూసింది. ఇలా పలువురు సైట్‌ ఇంజినీర్లు తమ బినామీల పేరుతో రూ.80 లక్షల మేర నిధులు డ్రా చేసి పంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు సాధారణ జీవితం గడిపిన వీరు నేడు లగ్జరీ కార్లతో పాటు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అవుట్‌స్సోరింగ్‌ ఉద్యోగి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈఈ సుబ్బరాయుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన పేరుతో చెక్కలపై ఫోర్జరీ సంతకాలు చేసిన నిధులు డ్రా చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ జరిపితే అవినీతి తిమింగలాల బాగోతం వెలుగుచూసే అవకాశం ఉంది.

స్పిల్‌ఓవర్‌ పనుల పేరుతో రూ.80 లక్షలు స్వాహా

చేసిన పనులకే మళ్లీ బిల్లులు

ఏపీసీ,ఈఈ పేరుతో దర్గామిట్ట కెనరా బ్యాంకులో జాయింట్‌ ఖాతా

దాని నుంచి బినామీ పేర్లతో నిధుల డ్రా

అవుట్‌స్సోరింగ్‌ ఉద్యోగి, ఏడుగురు సైట్‌ ఇంజినీర్లు కీలక పాత్ర

స్పిల్‌ ఓవర్‌ పేరుతో నిధులు కాజేసేందుకు నిబంధనలకు వ్యతిరేకంగా నెల్లూరు దర్గామిట్ట కెనరా బ్యాంకులో ఏపీసీ డీ వెంకటసుబ్బయ్య, ఈఈ సుబ్బారాయుడు 2025 జనవరిలో జాయింట్‌ ఖాతా ఓపెన్‌ చేశారు. గతంలో ఇలా ఎప్పుడు ఖాతాలు తెరవలేదు. వాస్తవంగా అకౌంట్‌ సెక్షన్‌ నుంచి నేరుగా పాఠశాలల జాయింట్‌ ఖాతాల్లో నిధులు జమచేసేవారు. పాఠశాలల్లో చేపట్టిన పనులకు స్కూల్‌ కమిటీ చైర్మన్‌, హెచ్‌ఎం చెక్కులు జారీ చేసేవారు. కానీ అలా చేయకుండా కెనరా బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసి బినామీల ద్వారా నిధులు కాజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement