సీతారామపురం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)పై జాతీయ ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఊరట కలిగించింది. అన్ మ్యాప్డ్ ఓటర్లను భయపెడుతున్న అంశంపై వివరణ ఇస్తూ తాజాగా శుభవార్త చెప్పింది. 2025, 2002 ఓటరు జాబితాల్లో ఓట్లు మ్యాప్ కాకపోయినా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. అయితే ఎన్నికల కమిషన్ గుర్తించిన ఆధార్‌తో పాటు 13 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదోక దాన్ని మాత్రం సమర్పించాలని షరతు పెట్టింది. జిల్లాలో 2025 ఓటర్ల జాబితా ప్రకారం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల వివరాలన్నీ 2002 జాబితాతో సరిపోల్చడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముఖ్యఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న ఓటర్లలో చాలామంది 2002 జాబితాతో పోల్చితే మ్యాప్ కావడం లేదు. దీంతో చాలామంది అన్‌మ్యాప్డ్‌గా మిగిలిపోతున్నారు. దీంతో వారంతా తమను ఓటర్లుగా తొలగిస్తారనే భయంతో ఉన్న నేపథ్యంలో అన్‌మ్యాప్డ్ ఓటర్లకు ఎన్నికల కమిషన్ వివరణతో కొంత ఆందోళన తగ్గింది.
2002, 2025 జాబితాల్లో లేకపోతే
ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో 2002 2025 ఓటరు జాబితాలు అత్యంత కీలకం. రెండు జాబితాల్లో ఓటరుగా ఉండడం లేదా తల్లిదండ్రులు వివరాలు కలిగి ఉండాలి. అప్పుడే ఓటరుగా కొనసాగిస్తారు. అయితే రెండు జాబితాల్లో పేర్లు లేని వారు ఏమి చేయాలంటే కొత్తగా ఓటు నమోదు ఫారం–6 నింపి ఇస్తే సరిపోతుంది. వారి పేరు కూడా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో వస్తుంది.
డబుల్ ఓటర్లకు.. ట్రబులే
ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో చాలా మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. అయితే గతంలో ఎన్నికల కమిషన్ చేపట్టే స్పెషల్ సమ్మరి డివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్)లో దానిని గుర్తించేందుకు డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పద్ధతిని వాడినా సరైన ఫలితం లభించేది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం చేపట్టే సర్‌లో మాత్రం డబుల్ ఓటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు చోట్ల ఓటు ఉన్నా ఒక్కచోటే ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వాలి. అలా కాదని రెండు చోట్ల ఇచ్చినా వారు సమర్పించే గుర్తింపు కార్డులతో పట్టుబడే అవకాశం ఉంది. దీంతో డబుల్ ఓటర్లకు ట్రబుల్ మొదలైంది అని చెప్పొచ్చు.
అన్‌మ్యాప్డ్ కాకపోయినా.
2002 ఓటరు జాబితాలో ప్రస్తుత ఓటరు వివరాలు లేకపోయినా, వారి తల్లిదండ్రుల వివరాలు లేకపోయినా మ్యాపింగ్ అయి ఉంటే చాలని, ఎన్యూమరేషన్ ఫారం ఇస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అన్‌మ్యాప్డ్ ఓటర్లకు నోటీసులు ఇస్తామని, తాము గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. 1987 జూలై 1వ తేదీ నాటికి ఓటరు జన్మించి ఉంటే తనకు సంబంధించిన గుర్తింపు కార్డులో ఒక్క దాన్ని ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1నుంచి 2004 డిసెంబర్ 2వ తేదీ మధ్యన జన్మించిన ఓటరైతే తన ఒక్క గుర్తింపు కార్డుతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన ఓటర్ అయితే తన గుర్తింపు కార్డుతో పాటు తల్లిదండ్రుల ఇద్దరి గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుంది. 2004 తరువాత విదేశాల నుంచి వచ్చి ఇండియాలో ఉంటే అతని పాస్‌పోర్టు, వీసాలను సమర్పించి ఓటుహక్కు పొందొచ్చు.
2002 జాబితాలో తల్లిదండ్రుల పేర్లు లేకపోయినా భయం అవసరం లేదు
ఎన్యూమరేషన్ ఫారం నింపితే చాలు
దానితో పాటు 13 రకాల గుర్తింపు పత్రాల్లో దేనినైనా సమర్పిస్తే సరి
2002, 2025 జాబితాలో పేరులేకున్నా ఫారం–6 ఇస్తే ఓటరుగా నమోదు
ఇప్పటి వరకు ఫారం ఇవ్వలేదు
ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చి ఫారం ఎవ్వరూ ఇవ్వలేదు. 67వ బూత్‌లో ఓటరు జాబితా 917 నంబరులో ఓటు ఉంది. ఫారం ఇవ్వలేదని అడిగితే మీది కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఫారం ఇవ్వకపోవడంతో ఎప్పుడు పూరించి ఇవ్వాలో అర్ధం కావడం లేదు.
– గంధళ్ల రాజమ్మ, మరుపూరు, పొదలకూరు
ఓటర్లకు పూర్తి సమాచారం తెలియదు
సర్ విషయంలో ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. బీఎల్వోలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి. వీఆర్‌ఏ వచ్చి నా ఒక్క ఓటుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారం మాత్రమే అందించాడు. మిగిలిన రెండు ఓట్లపై వీఆర్‌ఏకు అవగాహన లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంది. సర్ విషయాలపై ఓటర్లకు అవగాహన కల్పిండంలేదు. దీంతో ఓటర్లు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఓట్లు తొలగిస్తారేమోనని ఆందోళనలో ఉన్నారు. సమయం తక్కువగా ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. –బోయాజ్, న్యాయవాది, సోమశిల


