దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం రాత్రి వెంగమాంబ, గురవయ్యనాయుడు దంపతుల గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం నర్రవాడలోని వెంగమాంబ ఆలయంలో వెంగమాంబ, గురవయ్య దంపతులకు విశేష పుష్పాలంకరణ, పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వెంగమాంబ దంపతులను దర్శించుకున్నారు. హోమగుండంలో ఎండు కొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం లేని మహిళలు అమ్మవారి సన్నిధిలో వరపడ్డారు. రాత్రికి వెంగమాంబ పుట్టినిల్లు అయిన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో వెంగమాంబ దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం, తదితర గ్రామాల్లో గ్రామోత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగుల నడుమ వేడుకగా సాగింది. కాగా ఉత్సవాల్లో మూడోరోజు మంగళవారం కూడా వెంగమాంబ దంపతుల గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.


