వెంకటాచలం: దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను గన్నవరం పోలీసులు సోమవారం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఆదివారం ప్రశ్న రావణ్‌ను గన్నవరం కోర్టుకు హాజరు పర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ వి ధించింది. దీంతో గన్నవరం పోలీసులు సోమవా రం ఉదయం ప్రశ్న రావణ్‌ను నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద నున్న నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
54.94 శాతం
సర్ డిజిటలైజేషన్
నెల్లూరు (అర్బన్): జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితాకు సంబంధించి ఇప్పటి వరకు 10,84,562 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసి 54.94 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19,74, 240 మంది ఓటర్లుండగా, 19,43,973 ఫారాలను ఇంటింటికి తిరిగి బీఎల్వోలు పంపిణీ చేశారని, 98.47 శాతం ప్రగతి సాధించామని చెప్పారు. ఫారాలు తీసుకున్న ఓటర్లందరూ తమ వివరాలను నమోదు చేసి వెంటనే బీఎల్వోలకు అందజేసి ఓటును నిలుపుకోవాలని సూచించారు.
13లోగా సీజ్ చేసిన
వాహనాలను తీసుకెళ్లాలి
నెల్లూరు (టౌన్): రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పన్నులు చెల్లించని, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీటీసీ బీ చందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సదరు వాహనాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఈ నెల 13వ తేదీలోగా వాహనాల యజమానులు నెల్లూరులోని ఉప రవాణాశాఖ కార్యాలయంలో సంప్రదించి పన్నులు, ఫిట్నెస్ అపరాధ రుసుం చెల్లించి వాహనాలను తీసుకెళ్లాలని, లేకుంటే బహిరంగ వేలం వేస్తామని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


