ఆత్మకూరురూరల్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో మున్సిపల్ పరిధిలోని బట్టేపాడు రోడ్డు సమీపంలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగడానికి, వంట చేసుకోవడానికి, రోజువారి అవసరాలకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ నివాస ప్రాంతం కొండప్రాంతం ఏటవాలుగా ఉండడంతో పైభాగంలోని ఇళ్లకు తాగునీరు చేరడం లేదని వాపోయారు. ప్రత్యేకంగా వాల్వులు ఏర్పాటు చేసి నీటి సరఫరాను మెరుగుపర్చాలని, లేదంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. నెలలో ఎక్కువ రోజులు ఇదే సమస్య పునరావృతమవుతోందని వాపోయారు.


