నెల్లూరు(క్రైమ్): ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన మాదకద్రవ్యాల విష సంస్కృతి ఇప్పుడు జిల్లాలోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను తీసుకొస్తున్న ముఠాలు యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయి. తొలుత సరదాగా ప్రారంభమైన అలవాటు క్రమేపీ వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తోంది. అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు చాపకింద నీరులా సాగుతుండగా, ఇటీవల నగర పోలీసులు నిరర్వహించిన దాడుల్లో మరోమారు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇతర రాష్ట్రాల నుంచి..
జిల్లాకు చెందిన పలువురు యువత ఉన్నత చదువులు, ఉద్యోగరీత్యా కర్నాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఉంటున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి పార్టీలకు హాజరయ్యే క్రమంలో కొందరు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. అనంతరం వ్యసనానికి సరిపడా నగదు కోసం విక్రయదారులుగా మారుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. ఇటీవల నెల్లూరులో పోలీసులు నిర్వహించిన దాడిలో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారిలో ఒకరు బెంగళూరులో చదువుకునే సమయంలో డ్రగ్స్‌కు బానిసైనట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు అక్కడ ఎండీఎంఏ గ్రాము రూ.1,500కు కొనుగోలు చేసి నగరంలో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో సరఫరాదారులు, వ్యసనపరుల వివరాలను సేకరిస్తూ లోతుగా పోలీసు దర్యాప్తు సాగుతోంది.
మొక్కుబడి చర్యలకే..
రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ జిల్లాలో మొక్కుబడి చర్యలకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. నెల్లూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నా ముందస్తు సమాచారం లేకపోవడం ఆ విభాగ పనితీరును తెలియజేస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో అనేక కేసుల్లో..
నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో కొందరు జిల్లాలోనూ అమ్మకాలు సాగించినట్లు అక్కడి పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఓ డ్రగ్ పెడ్లర్ ఫోన్‌ను తెలంగాణ పోలీసులు పరిశీలించగా నెల్లూరుకు చెందిన కొందరు డాక్టర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. గతేడాది జిల్లాకు చెందిన ఓ యువకుడు విజయవాడలో డ్రగ్స్ సేవిస్తుండగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద నుంచి నిందితుడు కారుతో సహా పరారయ్యాడు. అతని కోసం అక్కడి పోలీసులు బుచ్చిలోనూ సోదాలు చేశారు.
డ్రగ్స్‌తో అనర్థాలు
డ్రగ్స్‌లో కొన్నింటిని ముక్కుతో పీలుస్తారు. కొన్నింటిని సిగరెట్‌లో నింపుకొని పొగ తాగుతున్నారు. కొన్నింటిని శీతల పానీయీలు లేదా మద్యంలో చల్లుకుని తాగుతారు. ఇవి కాకుండా మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో ఉంటాయి. డ్రగ్స్ నేరుగా మెదడుపై, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని ఇతర వ్యవస్థపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. మానసిక సమస్యలు వెంటాడుతాయి. చివరకు అకాల మరణాలకు కారమణవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి
జిల్లాలో డ్రగ్స్ కల్చర్ క్రమేపీ విస్తరిస్తుండటం యువత, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మాదకద్రవ్యాల సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీస్ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్
యువతే లక్ష్యంగా
మాదకద్రవ్యాల ముఠాలు
పోలీసుల దాడుల్లో వెలుగులోకి
అనేక విషయాలు
ఎండీఎంఏ గ్రాము
రూ.4 వేల నుంచి రూ.5 వేలు
నెల్లూరులో..
గతంలో నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు చైన్నెతోపాటు విదేశాలకు చెందిన వ్యక్తుల నుంచి కొకెయిన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో విద్యార్థులకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. గూడూరుకు చెందిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ధనలక్ష్మీపురంలో మాదకద్రవాల తయారీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.


