నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను స్వేచ్ఛగా విక్రయించుకుని ఇతర ప్రాంతాలకు తరలించే విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వారికి తీరని వేదనను మిగులుస్తోంది. పంటలను తమకు అనుకూలమైన సమయంలో కోతలు కోసుకుని, అధిక ధర ఉన్న ప్రాంతాలకు తరలించి విక్రయించుకునే అవకాశం గతంలో ఉండేది. అయితే ఈనెల ఒకటో తేదీ నుంచి కొత్తగా ఈ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పంటలను నేరుగా మార్కెట్‌కు తరలించే రైతులు ఆన్‌లైన్‌లో పర్మిట్ పొందేందుకు అనేక అవస్థలు పడుతున్నారు.
ఎన్నో ఇబ్బందులు
ఆన్‌లైన్ డేటాలో ప్రభుత్వం ముందుగానే పొందుపరిచిన వివరాల్లో ఏ ఒక్కటి పూర్తిగా నమోదు కాకపోయినా ఈ పర్మిట్ జారీ కావడం లేదు. వ్యవసాయంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా నేర్చుకోవాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాన్యువల్ విధానంలో సంబంధిత గుమాస్తాకు తెలియజేసి రూట్ పర్మిట్‌లో నాలుగు నుంచి ఐదు గంటల వరకు అదనపు రవాణా సమయాన్ని నమోదు చేయించుకుని, ఆ గడువులోగా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో ప్రాంతాల వారీగా కంప్యూటర్‌లో ముందుగానే రవాణా సమయాన్ని నిర్ణయించి, అదే ప్రకారం ఈ పర్మిట్ జారీ చేస్తున్నారు. దీంతో సమయం చాలా తక్కువగా ఉంటోందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా వాహనాలు నడపాల్సి వస్తోందని, ప్రమాదాలు జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర మనస్థాపం వ్యక్తం చేస్తున్నారు.
వారిపై భారం
అవినీతిని అరికట్టడానికే ఈ పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రైతులకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఖర్చుల భారం పెరిగి నష్టపోవాల్సి వస్తోంది. గతంలో పర్మిట్ రాసే గుమాస్తాకు మార్కెటింగ్ ఫీజుతోపాటు అదనంగా కొంత నగదు చెల్లిస్తే సరిపోయేదని, ప్రస్తుతం ఆన్‌లైన్ ఖర్చులు, టోల్‌గేట్ల వద్ద మామూళ్లు, నిఘా విభాగాలకు చెల్లించాల్సిన మొత్తాలను ట్రేడర్లు తమ నగదులోనే మినహాయించుకుంటున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త విధానాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప, ఎలాంటి లాభం ఉండటం లేదని రైతులు, లైసెన్స్‌డ్ ట్రేడర్లు, ట్రాన్స్‌పోర్టర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేవలం ఆదాయార్జనే ధ్యేయంగా మార్కెటింగ్ శాఖను ఉసిగొల్పి రైతులపై భారం మోపుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లక్ష్యం నెరవేరేనా?
గతేడాది జిల్లా మార్కెటింగ్ శాఖకు రూ.38 కోట్ల మార్కెటింగ్ ఫీజు వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ శాఖ అధికారులు లక్ష్యాన్ని అధిగమించి రూ.39 కోట్లకు పైగా వసూలు చేశారు. దీంతో ఈ ఏడాది ఏకంగా రూ.42.44 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల దీనిని చేరుకోవడం తలకుమించిన భారంగా మారుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, సరైన దిగుబడులు రాకపోవడం, కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడంతో ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదని రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెటింగ్ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదని శాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో కేవలం రూ.7 కోట్ల వసూలు మాత్రమే నమోదైంది. ఈ పరిస్థితిని బట్టి ఈ ఏడాది మొత్తం వసూలు రూ.28 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గితే సెస్ వసూళ్లు కూడా గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది మార్కెట్ కమిటీలు ఉండగా, 21 మార్కెటింగ్ టోల్‌గేట్ల ద్వారా సంబంధిత సిబ్బంది నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ సెస్ వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు.
పంట రవాణాకు
ఈ పర్మిట్ అమలు
కొత్త విధానంతో ఒరిగిందేమీ లేదు
ఖజానా నింపేందుకు కొత్త ఎత్తుగడ
ఆన్‌లైన్ టైమింగ్‌తో ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్‌పోర్టర్లు
మాన్యువల్, ఈ పర్మిట్లను అనుమతిస్తున్నాం
ఆన్‌లైన్ విధానానికి రైతులు, ట్రాన్స్‌పోర్టర్లు, ట్రేడర్లు ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి మాన్యువల్ పర్మిట్‌ను కూడా అనుమతిస్తున్నాం. ఎవరికై నా ఎటువంటి సందేహాలుంటే తమ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు.
– పి.అనితకుమారి,
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిణి


