నేడు ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’

Jul 6 2026 12:10 AM | Updated on Jul 6 2026 12:10 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ పరిధిలో ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని ఎస్‌ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్‌ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు చెప్పొచ్చు.

● తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్‌ ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్‌కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్‌ చేసి సమస్యలు చెప్పొచ్చు.

వసతి గృహంలో

మంత్రి తనిఖీలు

కావలి: పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న బాలికల సంక్షేమ వసతి గృహాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో వార్డెన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కుక్కను తప్పించబోయి..

ఆటో బోల్తా

ఇద్దరికి గాయాలు

వరికుంటపాడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 565 జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. ఉదయగిరికి చెందిన నరేష్‌, అంకమ్మ చేపలు తీసుకుని ఆటోలో వేంపాడు పంచాయతీ భోగ్యంవారిపల్లిలో అమ్మకానికి తీసుకెళ్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నరేష్‌, అంకమ్మలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో వారిని ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంకమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పతికి తీసుకెళ్లారు.

ఉప్పు కాలువలో మృతదేహం

తోటపల్లిగూడూరు(పొదలకూరు): మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలోని పాతపాళెం ఉప్పు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కాలువ వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి ఆచూకీ కోసం ఆరాతీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement