● వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దుత్తలూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు నిలుపు కార్యక్రమంతో ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. వెంగమాంబ, గురవయ్య దంపతుల విగ్రహాలను వేద పండితులు వేకువజాము నుంచే పూలతో అలంకరించి పూజలు చేశారు. గణపతి, సహస్రనామ, కుంకుమార్చన పూజలను జరిపారు. హోమ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్త వేమూరి ముసలయ్య దంపతులు పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంతానం లేని మహిళలు అమ్మవారి సన్నిధిలో వరపడ్డారు. పలువురు తమ వాహనాలకు పూజలు చేయించారు. పొంగళ్లను మహిళలు పొంగించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఎండు కొబ్బరిని హోమగుండంలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. వెంగమాంబ ఇష్టదైవమైన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ గుడిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచామృత, సుగంధ ద్రవ్యాలతో విగ్రహమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. విద్యుద్దీపాలంకరణతో ఆలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. వెంగమాంబ, వినాయకుడు, దుర్గాదేవి తదితర దేవతామూర్తుల కటౌట్లు ఆకర్షణగా నిలిచాయి.
అట్టహాసంగా నిలుపు కార్యక్రమం
నర్రవాడ పంచాయతీ మజరా గ్రామమైన వడ్డిపాళెంలో గల వెంగమాంబ పుట్టినిల్లయిన దేవర ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాన్ని ముత్తయిదువులు వైభవంగా చేపట్టారు. పరిసర ప్రాంతాలు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఉత్సవానికి మహిళలు భారీగా హాజరై పసుపు దంచేందుకు పోటీపడ్డారు. అనంతరం పసుపు, కుంకుమను నర్రవాడలోని అమ్మవారి దేవస్థానం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కాగా వెంగమాంబ, గురవయ్యనాయుడి దంపతుల గ్రామోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నారు.


