చెలరేగిపోతున్న గ్రావెల్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

చెలరేగిపోతున్న గ్రావెల్‌ మాఫియా

Jul 6 2026 12:10 AM | Updated on Jul 6 2026 12:10 AM

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

ప్రభుత్వాదాయానికి గండి

వింజమూరు(ఉదయగిరి): ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రావెల్‌ మాఫియా రెచ్చిపోతోంది. పగలూ, రాత్రనే తేడా లేకుండా అధికార పార్టీ నేతలు తరలిస్తూ రూ.లక్షలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ రూపంలో రావాల్సిన సొమ్ము పచ్చనేతల జేబుల్లోకి వెళ్తోంది. చెరువులు, భూముల్లో యథేచ్ఛగా వ్యవహారాన్ని సాగిస్తున్న అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది.

ప్రతి చోటా ఇంతే..

కలిగిరి మండలంలో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధిలో కాలువపై వేసిన మట్టిని ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా రాత్రివేళ విచ్చలవిడిగా తరలిస్తున్నారు. మూడు నెలలుగా ఈ దందా సాగుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న మట్టిని ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకొని వాహనాలను పోలీసులకు రెండ్రోజుల క్రితం అప్పగించారు. వీటిని విడిపించేందుకు పోలీసులపై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి వచ్చిందని తెలుస్తోంది.

హెచ్చరించినా మారని తీరు

వింజమూరులోని మలపరాజు చెరువు, వాగు తదితర ప్రాంతాల్లో మట్టిని రాత్రి వేళ అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. కలిగిరి మండలం భట్టువారిపాళెంలో పొలాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్‌ను తరలిస్తున్న జేసీబీలను వింజమూరు పోలీసులు ఇటీవల పట్టుకొని హెచ్చరించి వదిలేశారు. అయినా ఇదే పంథాను కొనసాగించడంతో జేసీబీ, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుత్తలూరు, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లోని ఇరిగేషన్‌ చెరువుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నా, సంబంధిత అధికారుల చర్యలు శూన్యంగా ఉంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement