● అందుబాటులోకి
బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో సేవలు
సీతారామపురం: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో చేపడుతున్న ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ మందకొడిగా సాగుతోంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 2953 పోలింగ్ కేంద్రాలు.. 19,74,240 మంది ఓటర్లున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికో బీఎల్వో ఉన్నారు. ఈ నెల 14 వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఆలోపు గణన పత్రాల డిజిటలైజేషన్‌కు సంబంధించి ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా, అధికారుల వద్దకెళ్లకుండా నేరుగా బీఎల్వోనే పరిష్కారం చూపేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు సైతం దీన్ని సద్వినియోగం చేసుకుంటే కొంత మేర వెసులుబాటు లభించనుంది.
ఈసీఐఎన్‌ఈటీ యాప్‌తో..
మొబైల్‌లో ఈసీఐఎన్‌ఈటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడి వివరాల ఆధారంగా మీ ప్రాంత బీఎల్వోను ఎంపిక చేస్తే నేరుగా వారికి కాల్ రిక్వెస్ట్ వెళ్తుంది. 48 గంటల్లోపు వారు సంప్రదించి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఎన్యూమరేషన్ పత్రం అందకపోతే ఇంటికొచ్చి ఇస్తారు. సదరు పత్రాలను పూర్తి చేసి అందజేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు రెండు కలర్ ఫొటోలు, ఏదో ఒక గుర్తింపు కార్డును ఫారంతో పాటు జతపర్చాల్సి ఉంటుంది.


