ఈ – సైన్‌ కష్టాలేమిటి సర్‌..? | - | Sakshi
Sakshi News home page

ఈ – సైన్‌ కష్టాలేమిటి సర్‌..?

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

ఆధార్‌.. ఓటరు ఐడీలోని పేర్లలో వ్యత్యాసాలతో చిక్కులు

ఆన్‌లైన్లో ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణకు ఆటంకాలు

వలస ఓటర్ల అగచాట్లు

సీతారామపురం: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి నిమిత్తం తెలంగాణ, కర్ణాటక, చైన్నె, గోవా, పుణె తదితర ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వలసెళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరూ సొంతూళ్లకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌)లో భాగంగా వలస వాసుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఎన్యూమరేషన్‌ పత్రాల సమర్పణకు అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఈ ప్రక్రియ కోసం చేస్తున్న యత్నాలు ఫలించడంలేదు.

వివరాలన్నీ నింపాక.. చివర్లో భంగపాటు

వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలన్నీ నింపాక ఆఖర్లో ఈ – సైన్‌ కావడంలేదు. దీంతో గంటల పాటు పడిన శ్రమ వృథా అవుతోందని వలస ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కుటుంబసభ్యులు, గ్రామస్తులకు వీరు ఫోన్‌ చేసి ఎన్యూమరేషన్‌ పత్రాలను ఎలా నింపాలని ఆరాతీస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ యాప్‌లు, పోర్టళ్ల ద్వారా వివరాలు నమోదు చేయడంపై చాలా మంది బీఎల్వోలకు అవగాహన కరువవడం.. సాంకేతికతపై పట్టు లేకపోవడంతో ప్రక్రియ కాస్త కుంటుపడుతోంది.

ప్రధాన ఇబ్బందులు

ఓటరు ఐడీ (ఎపిక్‌ కార్డు)లో ఉన్న పేరు.. ఆధార్‌లో ఉన్న పేరులో అక్షరాలు కొంచెం వేర్వేరుగా ఉన్నా.. తప్పులున్నా ఈ సైన్‌ కావడం లేదు. పుట్టిన తేదీ, ఇతర వివరాల్లో తేడాలున్నా నమోదు ఫెయిలనొస్తోంది. ఓటరు ఐడీ.. ఆధార్‌ నంబర్‌కు, ప్రస్తుత ఫోన్‌ నంబర్‌ లింక్‌ కాకపోయినా ఓటీపీ రావడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది ఓటర్లు పోర్టల్‌ను తెరుస్తుండటంతో పేజీ లోడ్‌ కాక సెషన్‌ ఎకై ్స్పర్‌ అని చూపుతోంది. ఆధార్‌లో ఇంటి పేరు ఉండగా.. ఓటరు గుర్తింపు కార్డులో ఇది లేకపోవడం, వయస్సు వేరుగా ఉండటం తదితర కారణాలతో ఆన్‌లైన్లో సర్‌ వివరాలను సమర్పించడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

బీఎల్వోలను సంప్రదించాల్సిందే

ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న వారి ఎన్యూమరేషన్‌ పత్రాలను స్థానికంగా ఉన్న తల్లిదండ్రులు లేదా కుటుంబసభ్యులు తీసుకొని వివరాలు నింపి సంతకం చేసివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వలసెళ్లిన వారు సెలవులు దొరక్క.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని రాలేక.. ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

సాధ్యం కావడంలేదు

సర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ పత్రాన్ని ఆన్‌లైన్లో నింపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లా. ఓటర్‌ ఐడీతో లాగినై వివిధ దశల్లో పత్రాలన్నీ నింపా. ఈ – సైన్‌ చేస్తే ప్రక్రియ పూర్తవుతుందనుకునే సమయంలో చివర్లో ఫెయిలని వస్తోంది. ఆధార్‌లో పేరుకు ముందు ఇంటి పేరు.. ఓటరు కార్డులో మాత్రం తర్వాత ఉంది. దీంతో గంటసేపు యత్నించినా ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సమర్పించడం సాధ్యం కాలేదు. చివరికి బీఎల్వోను ఆశ్రయించాల్సి వచ్చింది.

– మహబూబ్‌ షరీఫ్‌,

సీతారామపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement