నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు మే–2026 సెషన్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఆర్వో విజయకుమార్ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరులో రెండు, కావలిలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని కోరారు. ఉదయం సెషన్‌కు 9.15 గంటల తర్వాత, మధ్యాహ్నం సెషన్‌కు 2.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోనికి అభ్యర్థులను అనుమతించేది లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు పూర్తిగా నిషేధమన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.


